ఆ కోవకే: చిదంబరం కేసు తీర్పులో జగన్ కేసు ప్రస్తావన

By telugu teamFirst Published Aug 25, 2019, 12:47 PM IST
Highlights

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో పలువురు కుట్రదారుల లావాదేవీలపై అనేక పద్ధతుల్లో జరిపిన దర్యాప్తును పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని, భారీ పరిమాణంలో ప్రజాధనం కైంకర్యమైన నేరపూరిత కుట్రలో బెయిల్ పిటిషన్లపై కఠినంగా వ్యవహరించాలని గౌర్ అన్నారు. 

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు నేత పి. చిదంబరం అరెస్టు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సునీల్ గౌర్ ప్రస్తావించారు. అరెస్టు కాకుండా చిదంబరానికి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన బెయిల్ ను రద్దు చేస్తూ చెప్పిన తీర్పులో ఆయన జగన్ కేసును ఉటంకించారు. జగన్ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 

చిదంబరం కూడా ఆ కోవకే వస్తారని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. తీర్పులోని 20, 22 పేజీల్లో జగన్ పేరును ఆయన స్పష్టంగా ప్రస్తావించారు. ఆర్థిక నేరాలు మిగిలిన నేరాల కన్నా పూర్తిగా భిన్నమైనవని, వాటిని మిగిలిన కేసులతో పోల్చలేమని, అందువల్ల బెయిల్ ఇచ్చే ముందు విభిన్నంగా ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. 

భారీ కుట్ర ద్వారా పెద్ద యెత్తున ప్రజాధనానికి నష్టం వాటిల్లే విధంగా చేసిన కేసులను తీవ్రంగా పరిగణించాలని, ఆ విధమైన ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకే చేటు అని, దేశ ఆర్థికరంగాన్ని దెబ్బ తీసే చర్యలను తేలికగా తీసుకోరాదని ఆయన ఆయన అన్నారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో పలువురు కుట్రదారుల లావాదేవీలపై అనేక పద్ధతుల్లో జరిపిన దర్యాప్తును పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని, భారీ పరిమాణంలో ప్రజాధనం కైంకర్యమైన నేరపూరిత కుట్రలో బెయిల్ పిటిషన్లపై కఠినంగా వ్యవహరించాలని గౌర్ అన్నారు. 

భారీ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడేవారు ఎంతో నేర్పుగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేస్తారని అన్నారు. మోసపూరిత ఆర్థిక లావాదేవీలు దేశ ఆర్థికరంగానికి చేటు అని అన్నారు. ఆ వ్యాఖ్యలను బట్టి ప్రస్తుత కేసులో చిదంబరం బెయిల్ కొనసాగించడదం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలను ఇచ్చినట్లవుతుందని జస్టిస్ గౌర్ అన్నారు.  

click me!