టిడిపితో కలిసేది లేదన్న ప్రతిపక్షాలు..చంద్రబాబుకు షాక్

First Published Mar 28, 2018, 8:39 AM IST
Highlights
సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి, జనసేన, బిజెపిలు హాజరుకాలేదు.

చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. ప్రత్యేకహోదా, ఏపి విషయలో కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగడదామని అనుకున్న చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి, జనసేన, బిజెపిలు హాజరుకాలేదు. కాంగ్రెస్, వామపక్షాలు, లోక్ సత్తా లాంటి పార్టీలతో పాటు కొన్ని సంఘాలు మాత్రం హాజరయ్యాయి. అయితే, జరిగిన భేటీలో ఎక్కువ భాగం వివిధ పార్టీల ప్రతినిధులు చంద్రబాబును ఇరుకునపెట్టటానికే ప్రయత్నించాయి. వామపక్షాల కార్యదర్శులైతే చంద్రబాబును దుమ్ముదులిపేశారు.

గడచిన మూడున్నరేళ్ళుగా ప్రత్యేకహోదా పై చంద్రబాబు ఎన్నిసార్లు పిల్లిమొగ్గలేసిందీ గుర్తుచేశాయి. ప్రత్యేకహోదా లేదా కేంద్ర వైఖరిపై ఎప్పటి నుండో అఖిలపక్ష సమావేశం పెట్టాలని చేసిన డిమాండ్ ను ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశాయి. వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేయటం కోసమే రాష్ట్రప్రయోజనాలను గాలికొదిలేసారంటూ మండిపడ్డాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కాబట్టే వేరేదారి లేక అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబుపై ధ్వజమెత్తాయి.

మొత్తం మీద కాంగ్రెస్ తప్ప వామపక్షాలు, ప్రజాసంఘాలతో సహా మరే పార్టీ కూడా తెలుగుదేశంపార్టీతో కలిసి పోరాటం చేయటానికి అంగీకరించకపోవటం గమనార్హం. అన్నీ పార్టీలను కలుపుకుని రాష్ట్రంలో తాను బలీయమైన శక్తిగా కేంద్రానికి చాటి చెప్పాలనుకున్న చంద్రబాబు ప్రయత్నం మొదట్లోనే బెడిసికొట్టటంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. కాబట్టి టిడిపి భవిష్యత్ పోరాటాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

click me!