ఇద్దరిపై ఉన్న కేసులే అసలు సమస్యలు

First Published Mar 28, 2018, 7:21 AM IST
Highlights
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణంతో జగన్ కు సమస్యలు మొదలయ్యాయి.

రాష్ట్రంలో విచిత్రమైన పరిస్దితి నెలకొంది. దాదాపు అన్నీ పార్టీలు కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో రాష్ట్ర ప్రయోజనాలు గాలికిపోతున్నాయన్నది వాస్తవం. చంద్రబాబునాయుడు కావచ్చు లేదా వైఎస్ జగన్ కావచ్చు. విషయం మాత్రం ఒకే విధంగా ఉంటోంది. అందుకు ప్రధానమైన కారణాలు మాత్రం పై ఇద్దరిపైన ఉన్న కేసులే అని ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణంతో జగన్ కు సమస్యలు మొదలయ్యాయి. అక్రమాస్తులంటూ అప్పట్లో కాంగ్రెస్ కోర్టులో కేసు వేసింది. ఆ కేసులో టిడిపి కూడా భాగస్వామి అయ్యింది. అప్పటి కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సరే, ఆ కేసుల్లో కొన్నింటిపై సాక్ష్యాలు లేవని, ఉన్నతాధికారుల హస్తం లేదని ఒక్కో కేసు వీగిపోతోందనుకోండి అది వేరే సంగతి. కేసుల నుండి జగన్ కు ఇంకా విముక్తి అయితే కాలేదు. కేసులన్ని కూడా కేంద్రంలోని సిబిఐ చేతిలో ఉండటంతో జగన్ కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా ఉండక తప్పటం లేదు.

అదే సమయంలో చంద్రబాబుపైన కూడా అనేక కేసులున్నాయి. అవన్నీ కోర్టుల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు. మిగిలిన అన్నీ కేసులను వదిలేసినా రాష్ట్ర విభజన తర్వాత ఇరుకున్న ‘ఓటుకునోటు’ కేసు ఒక్కటి చాలు చంద్రబాబు పదవి ఊడిపోవటానికి. అందుకే ఆ కేసును కూడా విచారణ జరగకుండా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రింకోర్టులో ఉంది. ఎప్పుడైనా విచారణ మొదలుకావచ్చు.  కేసు విచారణ గనుక మొదలైతే చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకోవటం ఖాయం.

ఒకవైపు జగన్ కేసుల్లో నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తుండటం, అదే సమయంలో చంద్రబాబులో టెన్షన్ పెరుగుతుండటంతో ఇద్దరూ కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు తహతహలాడుతున్నారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు? ఏ మేరకు సక్సెస్ అవుతున్నారు? అన్న విషయంలోనే ప్రస్తుతం గొడవ జరుగుతోంది. అదే రాష్ట్రానికి శాపంగా మారింది.

 

click me!