
వృధ్దాప్య పెన్షన్ల కోసం బ్యాంకుల దగ్గిర క్యూల్లో నిలబడలేక పలు చోట్ల వృద్ధులు సొమ్ముసిల్లు తున్నారు. చనిపోతున్నారు. ఆంధ్రలో బుధవారం రెండుచోట్ల ఇద్దరు వృద్ధులు క్యూ దగ్గిర పడిపోయి ప్రాణాలు విడిచారు.
ప్రజలంతా తనతోనే ఉన్నారని, దేశం ముందుకు పరిగెడుతూ ఉందని ఎక్కడ బడితే అక్కడ (పార్లమెంటులోతప్ప) అరుస్తున్న ప్రధాని మోదీకి ఈ విషయం ఎలా తెలుస్తుంది. తెలిసినా నమ్మక పోవచ్చు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామవాసి బొర్రా వెంకట్రావు (69) పింఛను కోసం బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిలబడి సొమ్మసిల్లి పోయాడు. ఆసుప్రతికి తీసుకువెళ్లినా ఆయన్ను కాపాడ లేకపోయారు. అందురు చూస్తుండగనే వెయ్యి రుపాయల కోసం ఆయన ప్రాణం విడిచారు. ఇది మంగళవారం జరిగింది.
తర్వాత 24 గంటలు కూడా గడవక ముందే బుధవారం మరో ఇద్దరు వృద్ధులు బ్యాంకులకు, మోదీ మోజుకు బలయ్యారు. అనంతపురం అగళిలో మహిళా పెన్షనర్లు పెన్షన్ అందక కర్నాటక బ్యాంకు దగ్గిర ఆందోళన పూనుకున్నారు.ఉత్తచేతుల్తో ఇంటికి వెళ్లలేమని బ్యాంకు వాళ్లకు చెప్పేశారు.
బ్యాంకులున్న ప్రతిచోటా నగదు కోసం క్యూలు, తోపులాటలూ, తొక్కిసలాటలూ, తన్నులాటలు జరుగుతున్నాయి. వికలాంగుల ఎండలో మూడు చక్రాల బళ్ల మీదనే ఉండి వేచి మాడటం కనిపించింది.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తుంపాయనిపల్లి లక్ష్మమ్మ (66) వృద్ధ్యాప్య పింఛను కోసం బ్యాంకు ఖాతా ప్రారంభించడానికి బుధవారం మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంకుకు వచ్చింది. మెట్లు ఎక్కబోతుండగా ఆయాసం వచ్చి కుప్ప కూలింది. కుమారుడు సుబ్రహ్మణ్యం ఆమెను వెంటనే ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అయితే ఆమె అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.
గుంటూరు చుట్టుగుంట్లకు చెందిన రిటైర్డు ఉద్యోగి షేక్ మౌలాలి (75) పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్ వద్ద క్యూలో నాలుగు గంటల నిరీక్షించి అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే వైద్యుని వద్దకు వెళ్లాడు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గుంటూరు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. వెళ్లేందుకు సిద్దమవుతుండగా మృతి చెందాడు.
శ్రీకాకుళం జిల్లా మందస మండల కేంద్రంలోని ఎస్‌బిఐ బ్రాంచి వద్ద వృద్ధాప్య పింఛను కోసం బుధవారం క్యూలో నిల్చొన్న వృద్ధుడు మజ్జి శతృఘ్నుడు సొమ్మసిల్లి పడిపోయాడు.
గుంటూరు జిల్లా అమరావతి ఎస్‌బిఐ వద్ద కూడా ఓ మహిళ స్పృహ తప్పిపడిపోయింది. ధరణికోటకు చెందిన కె.శాంతమ్మకు తొక్కిసలాటలో చేతికి గాయమైంది. ఎం.సామ్రాజ్యం అనే మహిళ స్పృహ కోల్పోయి పడిపోయింది. వీరిద్దర్నీ స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.
ప్రకాశం జిల్లా వెలిగండ్లలోని సిండికేట్ బ్యాంకు ఎదుట గేట్లు తెరవక ముందే వచ్చి, బ్యాంకు తెరిచే దాకా వేచి చూసి, అలసి రామలింగాపురం గ్రామానికి 70 ఏళ్ల వెంకటమ్మ కళ్లు తిరిగి కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఎస్‌ఐ చొరవ తీసుకుని ఆమెకు నగదు ఇప్పించి ఇంటికి పంపించారు.