
ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న రోడ్డు విస్తరణ పనులు నంద్యాలలో మంగళవారం మొదలయ్యాయి. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నుండి నూనెపల్లె వరకూ రోడ్డుకు రెండు వైపులా ఉన్న షాపులు ఇళ్లు, హోటళ్ళను అధికారులు కొట్టేస్తున్నారు. మధ్యాహ్నం హటాత్తుగా ప్రారంభమైన కూల్చివేతలతో ముందు యజమానులు, అద్దెకుంటున్న వారు భయపడిపోయారు. అయితే, రోడ్డు విస్తరణ పనులను అధికారులు మొదలుపెట్టారని తెలిసింది. మున్సిపాలిటీ మొత్తం మీద ఇళ్ళు, వర్తక, వాణిజ్య సముదాయాలు, హోటళ్ళు అన్నీ కలిసి సుమారు 10 వేల వరకూ కూల్చివేతకు గురవుతాయన్నది ఓ అంచనా.
మంత్రులు, అధికారులు చెప్పిన ప్రకారం ఈనెల 22వ తేదీ నుండి రోడ్డు విస్తరణ పనులు మొదలవ్వాలి. కానీ నాలుగు రోజుల ముందే అధికారులు మొదలుపెట్టేయటం గమానార్హం. కాకపోతే ఇక్కడ ఓ సమస్య మొదలైంది. రోడ్డు విస్తరణ పనుల్లో ఆస్తులను కోల్పోయే వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. కానీ నష్టపరిహారం కొంతమందికి మాత్రమే అందాయని ఆరోపణలు వినబడుతున్నాయి. అదికూడా టిడిపికి సంబంధించిన వారికి మాత్రమే నష్టపరిహారం అందుతోందని తెలియటంతో మిగిలిన వారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
రోడ్డు విస్తరణ పనుల్లో తమ ఆస్తులను కోల్పోవటానికి బాధితులు మానసికంగా ఎప్పుడో సిద్దమయ్యారు. కానీ అందరికీ నష్టపరిహారం అందటం లేదన్నదే ఇపుడు సమస్యగా మారింది. అదికూడా ఉపఎన్నికల ముందు నష్టపరిహారం విషయంలో స్ధానికులు మొదలుపెట్టిన ఆందోళన అభ్యర్ధికి నష్టం చేకూర్చే అవకాశం ఉందన్న విషయాన్ని అదికారపార్టి మర్చిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.