
రాష్ట్రంలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కిడ్నీ బాధితులంటేనే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్థానం మడలం. కానీ అంత కాకపోయినా ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ బాధితులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. విచిత్రమేంటంటే రెండు ప్రాంతాల్లో కూడా దశాబ్దాల తరబడి కిడ్నీ సమస్య జనాలను పట్టి పీడిస్తూనే ఉంది. రెండు జిల్లాల్లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఫ్లోరైడ్ సమస్యే అని నిపుణులు ఎప్పుడో తేల్చారు.
నీటి కోసం బావులు, బోర్లు వేయించుకున్నపుడు ఆ నీటిలో కలిసి ఫ్లోరైడ్ మనుషుల శరీరాల్లోకి చేరుతోంది. సంవత్సరాల తరబడి అలా ఫ్లోరైడ్ శరీరాల్లో పేరుకుపోతుండటంతో దాని ప్రభావం రెండు రకాలుగా ఉంటోంది. మొదటగా ఎముకల మీద చూపుతోంది. ఎముకలు గుల్ల బారిపోవటం, పటుత్వం కోల్పోయి ఒంకరులు తిరిగిపోతున్నాయి. ఇక, రెండో సమస్య కిడ్నీలపై ప్రభావం. ఈ విషయాలు పాలకులకు కూడా తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు.
ఫ్లోరైడ్ సమస్యను అధిగమించాలంటే బయట ప్రాంతాల నుండి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవటం ఒకటే మార్గమని నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. అయినా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల వేలాదిమంది ఫ్లోరైడ్ బాధితులుగా మారిపోతున్నారు. చివరకు అదే ఫ్లోరైడ్ కిడ్నీల్లోకి చేరుతుండటంతో దాని ప్రభావం రోగులపై దారణంగా పడుతోంది. మూత్రం ఆగిపోయిన రోగులకు డయాలసిస్ ఒక్కటే ఆధారం. సమస్య అంతా ఇక్కడే మొదలవుతోంది. డయాలసిస్ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా అన్నీ చోట్లా సౌకర్యమూ లేదు, నిపుణులూ లేరు.
దాంతో డయాలసిస్ కూడా అందుబాటులో లేకపోవటంతో వేలాదిమంది చనిపోతున్నారు. ఉథ్థానంలో అయినా ప్రకాశం జిల్లా కనిగిరిలో అయినా జరుగుతున్నది అదే. సినీనటుడు పవన్ కల్యాణ్ పుణ్యమా అని ఉథ్థానం సమస్య ప్రపంచానికి తెలియగా, ప్రకాశం జిల్లాలోని సమస్య తెలీలేదంతే.
అదే విషయమై అసెంబ్లీ మీడియా పాయింట్లో సోమవారం కనిగిరి ఎంఎల్ఏ కదిరి బాబురావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్దానం తరువాత కనిగిరి లోనే కిడ్నీబాధితులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో 5 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 345(రికార్డల ప్రకారం) మంది చనిపోయినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు గత 3 నెలలు నుండి 2500 రూపాయల పెన్షన్ ప్రభత్వం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయుంచుకుంటున్నవారికి కూడా పెన్షన్ ఇవ్వాలని ఎంఎల్ఏ డిమాండ్ చేస్తున్నారు.