జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ కంటే...ఆ క్యాలెండరే బెటర్: అచ్చెన్నాయుడు ఎద్దేవా

By Arun Kumar PFirst Published Jun 19, 2021, 9:34 AM IST
Highlights

తాము అధికారంలోకి వస్తే 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన జగన్ కనీసం 30వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు అచ్చెన్నాయుడు. 

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలండర్ కంటే మార్కెట్లో దొరికే మాములు క్యాలెండర్ బెటర్ అని ఎద్దేవా చేశారు ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. సాధారణ క్యాలెండర్ లో కనీసం రాశి ఫలాలు అయినా చూసుకోవచ్చని అచ్చెన్న అన్నారు.

''తాము అధికారంలోకి వస్తే 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని... ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ 2 ఏళ్ళు కాలక్షేపం చేశాడు. ఇప్పుడు కేవలం 10 వేల ఉద్యోగాల పేరుతో జాబ్ క్యాలండర్ విడుదల చేసి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు.  2 లక్షల 30 వేలు భర్తీ చేస్తామని చెప్పి కనీసం 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వపోవడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు.

''ఒక్క పోలీసు శాఖలోనే 7 వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 470 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం వింతగా ఉంది. 25 వేల డీఎస్సీ టీచర్ల పోస్టులు ఉంటే వాటి గురించి అసలు క్యాలండర్ లో ప్రస్తావించలేదు. నిన్న జగన్ రెడ్డి విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదు చీటింగ్ క్యాలెండర్. దానిలో చెప్పిన లెక్కలన్నీ మాయమాటలు, అంకెల గారడీ మాత్రమే'' అని విమర్శించారు.

read more  నేరచరితులకు పదవుల కోసం... సతీసమేతంగా గవర్నర్ వద్దకా!: వర్ల సీరియస్

''రెండేళ్లల్లో 6లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని డబ్బా కొడుతున్నారు. 2 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలిస్తే మరి ఈ ఏడాది కనీసం 1 లక్ష ఉద్యోగాలైన ఇవ్వాలి కదా? కేవలం 10 వేల ఉద్యోగాలే ఎందుకు ప్రకటించారు? మీ మోసం ఇందులోనే తెలిసిపోయింది. మీరు ఇచ్చామని చెబుతున్న 6 లక్ష ఉద్యోగాల్లో 3 లక్షలు వాలంటీర్ పోస్టులే. మిగతా టీడీపీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చినవి మరికొన్ని. మద్యం అమ్మేవారివి కూడా ఉద్యోగాలేనా?'' అంటూ అచ్చెన్న నిలదీశారు. 

''కోవిడ్ సమయంలో 3 నెలలు పని చేసేందుకు కాంట్రాక్టు పద్దతిలో తీసుకున్న నర్సు పోస్టులను కూడా క్యాలండర్ లో పెట్టారు. కృష్ణపట్నం ఆనందయ్య కు డాక్టర్ పోస్టు ఇచ్చామని... ఆయన ఆశ్రమంలో ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది.  ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి ఉన్న ఉద్యోగాలను కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పడం సిగ్గుమాలిన చర్య.  జగన్ రెడ్డి ఇకనైనా అబద్దాలతో ప్రజలను మోసం చేయడం మానుకోవాలి'' అని అచ్చెన్నాయుడు సూచించారు. 


 

click me!