గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ, దుట్టాకు నాన్‌ బెయిలబుల్ వారెంట్లు జారీ..

By Sumanth KanukulaFirst Published Apr 1, 2023, 10:07 AM IST
Highlights

గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులపై నాన్‌ బెయిలబుల్ వారెంట్లు (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయ్యాయి.

విజయవాడ: గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులపై నాన్‌ బెయిలబుల్ వారెంట్లు (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయ్యాయి. 2018లో వారిపై నమోదైన కేసుకు సంబంధించి నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్డి శుక్రవారం ఈ వారెంట్‌ను జారీ చేసింది. వివరాలు.. వైసీపీ సానుభూతిపరులపై 2018లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తప్పుడు కేసులు పెట్టారని నిరసిస్తూ యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట 18 గంటలపాటు ధర్నా నిర్వహించారు.

అయితే విధులకు ఆటంకం కలిగించి ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు వెంకట్రావు, రామచంద్రరావు తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి నూజివీడు కోర్టులో విచారణ  జరుగుతుంది. అయితే కేసు విచారణకు హాజరుకాకపోవడంతో.. నూజివీడు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి శుక్రవారం  యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులతో పాటు ఇతర వైసీపీ కార్యకర్తలకు నాన్‌ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. 

ఇదిలా ఉంటే.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా మారారు. దీంతో గన్నవరం వైసీపీలో వర్గపోరు నెలకొంది. వంశీని వెంకట్రావు, రామచంద్రరావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

click me!