
అమరావతి: అట్టడుగు వర్గాలకు చదువు ఇప్పుడిప్పుడే అందుతున్నది. ఇప్పటికీ కూలి చేసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఉన్నత విద్య అభ్యసించని కుటుంబ వారసత్వం ఇంకా ఉన్నది. చదువుకుందామనే ఆశ ఉన్నప్పటికీ పేదరికం అడ్డుగోడలు కడుతున్నది. అందుకే కొన్ని పేద కుటుంబాలు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి సర్వం వెచ్చిస్తుంటారు. ఇలా చదువుకోవాలనే ఆశ గుండె నిండా ఉన్నా.. కటిక పేదరికం కాళ్లకు కంచె వేస్తున్న ఘటన ఒకటి తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.
కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలిక మంచి మార్కులతో టెన్త్ పాసైంది. పై చదువులు చదవాలని ఆరాటపడుతున్నది. కానీ, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వాళ్లది. అందుకే అమ్మ కూలి చేయడానికి తీసుకెళ్లుతున్నది. చదువు పై మమకారంతో ఆ బాలిక తన తల్లిపైనే పై అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన అంతరాల దొంతరను కుదిపేసినట్టయింది.
నిర్మలమ్మ 534 మార్కులతో పది పాసైంది. తాను ఇంకా చదువుకుంటానని తల్లికి విజ్ఞప్తి చేసినా.. ఆమె నిస్సహాయత వ్యక్తీకరించింది. ఆమె కలలు కల్లలవుతున్నట్టు భావించింది. అదే సందర్భంలో ఆదోని మండలం పెద్దహరివానంలో తహశీల్దారు, ఎంపీడీవో, ఎస్ఐ.. సహా పలువురు అధికారులు ఓ అధికారిక కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు నిర్మలమ్మ తన తల్లిపై వారికి ఫిర్యాదు చేసింది.
దీంతో ఆ అధికారులు నిర్మలమ్మ తల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె కూలి చేస్తేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లుతాయని అధికారులకు చెప్పింది. దీంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వ పథకాల ద్వారా నిర్మలమ్మను చదివించే బాధ్యత తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇక నిర్మలమ్మ కష్టాలు తీరినట్టేనా? ఆమె మళ్లీ భుజానికి పుస్తకాల బ్యాగ్ వేస్తుందా? అనేది వేచి చూడాలి.