మరో ట్విస్ట్ ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్: సుప్రీంకోర్టుకు ఫిర్యాదు

By telugu teamFirst Published Aug 1, 2020, 7:45 AM IST
Highlights

వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ట్విస్ట్ ఇచ్చారు. న్యాయమూర్తులపై తమ్మినేని సీతారాం వంటి నేతలు చేసిన వ్యాఖ్యలను నిమ్మగడ్డ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.

న్యూఢిల్లీ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారానికి మరో ట్విస్ట్ ఇచ్చారు. సోమవారంనాడు ఆయన ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. తనను ఎస్ఈసీగా తిరిగి నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన మరో విషయంపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. 

ఎస్ఈసీగా తనను పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించిన నేపత్యంలో న్యాయమూర్తులను అధికార పార్టీ నేతలు తీవ్రంగా దూషించారని ఆయన ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారామ్ నుంచి వైసీపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వరకు న్యాయమూర్తులను దుర్భాషలాడారని, పలువురు సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

కోర్టు హాళ్ల నుంచి న్యాయమూర్తులు పాలన సాగిస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో కోర్టులే నిర్ణయిస్తే ఎన్నికలెందుకు, ఎమ్మెల్యేలూ ఎంపీలనూ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలని, ప్రభుత్వ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. ఇది దారుణం అని తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించారు. వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ లను ఆయన కోర్టుకు ఇచ్చారు. 

న్యాయమూర్తులకు రమేష్ కుమార్ కోట్ల రూపాయలు చెల్లించారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన అఫిడవిట్ లో ఉదహరించారు. హైకోర్టులో నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ మీద విచారణను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఆనయ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసారు. 

హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా భావించిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు హైకోర్టుపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. న్యాయమూర్తులకు వ్యక్తిగతంగా, కులాలను ఆపాదించి కొందరు దూషించారని ఆయన అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి, అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖలు రాశారని, అయినా అధికార వర్గాలు చర్యలు తీసుకోకపోవడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారని ఆయన గుర్తు చేశారు. 

click me!