
సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్ధిని రితి సాహ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత హత్య కేసుగా మార్చారు పోలీసులు. ఇదే సమయంలో దర్యాప్తులోకి బెంగాల్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రితి సాహ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన దీదీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కోల్‌కతాలోని నేతాజీ నగర్ పీఎస్‌లో బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే విశాఖకు చేరుకున్న నేతాజీ నగర్ పోలీసులు.. రితి కేసుపై విచారణ చేపట్టారు.
కాగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్ధిని రితి సాహ విశాఖలో ఈ నెల 14న అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కాలేజీ ఆవరణలోనే ఆమె మరణించడం, పోలీసులు సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాలేజీ యాజమాన్యం వద్ద లంచం తీసుకుని పోలీసులు కేసును నీరు గారుస్తున్నారంటూ రితి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే లంచం ఆరోపణలపై విశాఖ నగర పోలీస్ కమీషనర్ త్రివిక్రమ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది.