
ఏపీలోని కళాకారులకు త్వరలో ఐడీ కార్డులు ఇస్తామన్నారు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐడీ కార్డులు మంజూరుకు సీఎం వైఎస్ జగన్ అనుమతులు ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టులు ఏజెంట్లకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్ధితులు వున్నాయని.. అయితే ఆ అవసరం లేకుండా కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు పోసాని వెల్లడించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని కళాకారుల డేటా బేస్ తయారు చేస్తుందని.. తద్వారా ఎవరి ప్రమేయం లేకుండానే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని కృష్ణమురళి చెప్పారు.
నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించామని.. నాటకాల కోసం 115, ఉత్తమ పుస్తకాల కేటగిరీలో 3 దరఖాస్తులు వచ్చాయని పోసాని చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు దరఖాస్తుల పరిశీలన వుంటుందని, 19న విజేతలను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఇక జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్‌కు పోసాని కృష్ణ మురళి అభినందనలు తెలియజేశారు.
బన్నీ చాలా మంచివాడని, తనను ఎంతగానో అభిమానిస్తారని గుర్తుచేసుకున్నారు. ఓసారి తనకు రూ.5 లక్షలు ఇచ్చి.. మంచి పనికోసం ఉపయోగించమని చెప్పారని అల్లు అర్జున్ కోరిక మేరకు చదువు ఆపేసిన ముగ్గురు విద్యార్ధులకు రూ.1.50 వేల చొప్పున ఇచ్చానని పోసాని చెప్పారు. మిగిలిన రూ.50 వేలను మరో ముగ్గురికి పంచానని ఆయన వెల్లడించారు.
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మండిపడ్డారు. తనను హత్య చేయడానికి లోకేష్ కుట్ర పన్నుతున్నారని.. కోర్ట్‌కు హాజరయ్యేటప్పుడు తనను చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. లోకేష్ తనపై రూ.4 కోట్లు పరువు నష్టం దావా వేశారని ఫైర్ అయ్యారు. లోకేశ్ ఎవరిపై విమర్శలు చేయలేదా అని పోసాని ప్రశ్నించారు. లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్లు జైల్లో వుంటారని పోసాని హెచ్చరించారు. సీఎంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన లోకేష్‌పై పరువు నష్టం దావా వేయకూడదా అని పోసాని ప్రశ్నించారు. నాపై పాత కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కృష్ణమురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: కోర్ట్ దగ్గర నా హత్యకు కుట్ర.. లోకేష్‌దే బాధ్యత : పోసాని సంచలన వ్యాఖ్యలు
హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారని.. మరి హెరిటేజ్ ఆస్తులు లోకేశ్‌కు చెందవా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టడంతో తనపై కక్షకట్టారని.. పుంగనూరులో పోలీసులపై కూడా హత్యాప్రయత్నం చేశారని పోసాని ఆరోపించారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబన్నారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు వున్నా జైలుకు వెళ్లలేదని.. కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని పోసాని ఫైర్ అయ్యారు.
కులాభిమానం వుండొచ్చు కానీ.. దురాభిమానం వుండకూడదన్నారు. గెలిచింది ఎవరైనా ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా అనేది చూడాలని పోసాని కృష్ణమురళీ అన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్సార్ రూ.11 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశారని ప్రశంసించారు. అమరావతిలో 5 శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టంలో వుందని.. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని పోసాని ఆరోపించారు.