
నారా లోకేష్ మంత్రివర్గ సహచరుడుని అవమానం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. లోకేష్ మంత్రిగా కొత్తగా బాధ్యతలు తసుకున్న సంగతి తెలిసిందే కదా. అదే విధంగా కొత్తగా నియమితులైన మరో మంత్రి జవహర్ లోకేష్ ను కలుద్దామని ఆయన ఛాంబర్ కు వచ్చారట. బాధ్యతలు తీసుకునేముందు ఎంతైనా సిఎం కొడుకు కాబట్టి లోకేష్ ను కలిసి ఆశీస్సులు తీసుకుందామన్నది జవహర్ ఉద్దేశ్యం. అందుకే లోకేష్ ఛాంబర్ వద్దకు వచ్చారు. అయితే, అక్కడే కొత్తమంత్రికి ఊహించని పరాభవం ఎదురైంది. అపాయింట్ మెంట్ లేకుండా వచ్చారన్న కారణంగా లోకేష్ సహచరుడని కూడా చూడకుండా మంత్రిని దాదాపు గంటపాటు సందర్శకుల గదిలోనే వేచి వుండేట్లు చేసారట.
మామూలుగా అయితే, ఒక మంత్రి ఛాంబర్ కు మరో మంత్రి ఎవరైనా వస్తే ఎంత ముఖ్యమైన సమావేశంలో ఉన్నా కూడా వచ్చిన మంత్రితో మాట్లాడేసి పంపేస్తారు. లేదా యాంటీ ఛాంబర్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కనీస మర్యాదలు చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది లోకేష్ కదా? పైగా చంద్రబాబునాయుడు కొడుకు. ఇక చెప్పేదేముంది. మంత్రైనా వెయిట్ చేయక తప్పలేదు. సాధారణ సందర్శకులతో పాటు మంత్రి వెయిట్ చేయటాన్ని గమనించిన అధికారులు విస్తుపోయారు. కానీ చేసేదేం లేక మాట్లాడకుండా ఉండిపోయారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా లోకేష్ ఇదే విధంగా వ్యవహరించటం అప్పట్లో పార్టీలో వివాదాస్పదమైంది. ఎంతో సీనియర్ నేతలు వచ్చినా అపాయింట్మెంట్ లేనిదే ఎవరితోనూ మాట్లాడనని చెప్పేవారు. ప్రతిభా భారతి, జెసి దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వెనక్కుతిరిగి వెళ్లిపోవటం అప్పట్లో సంచలనం. మంత్రైన తర్వాత కూడా లోకేష్ పద్దతి మారలేదన్న విషయం తాజాగా రుజువైంది.
ఓవైపు చంద్రబాబు దళితులను అవమాన పరుస్తున్నారంటూ, మోసం చేస్తున్నారంటూ ఎంపి శివప్రసాద్, దళిత నేతలు ధ్వజమెత్తుతున్నారు. అదే సందర్భంలో లోకేష్ కూడా మరో దళిత మంత్రిని అవమానించారంటూ సచివాలయంలో తాజాగా ప్రచారం మొదలైంది. అంటే తండ్రి, కొడుకుల మీద ఒకే విధమైన ప్రచారం జరుగుతోంది.