
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళ పోలీసుల యూనిఫామ్ కొలతలను పురుషులు తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నెల్లూరు జిల్లాలో మహిళ పోలీసులకు కొత్త యూనిఫామ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే దస్తులు కుట్టేందుకు కొలతలు తీసుకునేందుకు పురుష టైలర్లను పంపారు. ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. యానిఫామ్ కొలతలు తీసుకునేందకు పురుష టైలర్‌లను ఏర్పాటు చేయడంపై మహిళ పోలీసులు అంతర్గతంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము చాలా ఇబ్బంది పడ్డామని వాపోయారు.
మహిళ సిబ్బందికి మహిళ టైలర్లు కాకుండా పురుషులు కొలతలు తీసుకోవడంపై తీవ విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు శాఖ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నెల్లూరు విజయరావు ఎస్పీతో మాట్లాడారు. ఈ క్రమంలోనే స్పందించిన విజయరావు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.
మహిళా పోలీస్ లకు సంబంధించి యూనిఫామ్ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ కు అప్పచెప్పామని ఎస్పీ తెలిపారు. పురుషుడు మహిళ సిబ్బంది కొలతలు తీశాడనే విషయం తెలిసిన వెంటనే స్పందించామని అన్నారు. అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగేలా మొత్తం మహిళా అధికారులు, మహిళా టైలర్స్ నే నియమించాలని ఆదేశించినట్టుగా చెప్పారు. మహిళల రక్షణ, వారి గౌరవం పెంచడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం అన్నారు. ఎటువంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని కోరారు.
తనకు సమాచారం వచ్చిన వెంటనే ఈ ఘటనపై ఆరా తీసినట్టుగా ఎస్పీ చెప్పారు. ఒక వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండా సెల్‌ఫోన్ తీసుకుని లోనికి వచ్చి ఫొటోలు తీసుకుని వెళ్లాడని చెప్పారు. ఇది మహిళల ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ అని చెప్పారు. ఆ వ్యక్తిని గుర్తించినట్టుగా చెప్పారు. అతడిపై మహిళ పోలీసుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలు..
టైలర్ మెజర్ మెంట్స్ తీసుకునే ఇంచార్జ్‌గా ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై జిల్లా ఎస్పీ విజయారావు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీసుల యానిఫామ్ కొలతలు తీసుకోవడంలో మహిళా పోలీసులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.