నెల్లూరు సిటీ వైసీపీలో విభేదాలు.. ఎమ్మెల్యే అనిల్ ఆత్మీయ సమ్మేళనంపై ఉత్కంఠ..!!

Published : Jun 23, 2023, 01:02 PM IST
 నెల్లూరు సిటీ వైసీపీలో విభేదాలు.. ఎమ్మెల్యే అనిల్ ఆత్మీయ సమ్మేళనంపై ఉత్కంఠ..!!

సారాంశం

నెల్లూరు సిటీ వైసీపీలో గత కొంతకాలంగా నేతల మధ్య విభేదాలు  కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనం చర్చనీయాంశంగా మారింది.   

నెల్లూరు: అధికార వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. వారిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉంటే, నెల్లూరు సిటీ  నియోజకవర్గం వైసీపీలో కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. నెల్లూరు సిటీలో స్థానిక ఎమ్మెల్యే  అనిల్ కుమార్ యాదవ్‌కు వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. 

నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌ కుమార్ యాదవ్‌, నూడా చైర్మన్ ద్వారకానాథ్‌లు ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌కు దూరం అయ్యారు. రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లతో కూడా అనిల్‌కు సఖ్యత లేదు. ఇక,  రూప్ కుమార్ యాదవ్ అయితే ఏకంగా ప్రత్యేకంగా కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలను అనిల్ కుమార్‌ యాదవ్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. అక్కడి నుంచి ఎటువంటి  స్పందన లభించలేదని  తెలుస్తోంది. 

మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్ష పదవిని అప్పగించింది. ఈ నియామకం సమయంలో అనిల్ కుమార్ యాదవ్‌ను పార్టీ  సంప్రందిచలేదని ఆయన వర్గం గుర్రుగా ఉంది. ఈ క్రమంలోనే ఒకరి బలహీనతలు మరొకరు  బయటపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఇందుకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు ఆహ్వానం అందింది. అయితే ఈ ఆత్మీయ సమావేశంతో నెల్లూరు సిటీ వైసీపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?