
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన నరేంద్ర మోడీ, ఇతర బీజేపీ పెద్దలతో తనకు రాజకీయాలకు అతీతమైన సత్సంబంధాలు వున్నాయన్నారు. అవన్నీ రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి వున్నాయని పవన్ తెలిపారు.
అమిత్ షాతో జరిగిన భేటీలో తాను చెప్పదలచుకున్నది చెప్పానని.. నిర్ణయం జరిగిపోయిందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కోరుకుంటే ముఖ్యమంత్రిని కాలేనని.. జనం కోరుకుంటేనే సీఎంను కాగలనని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వంలో జనసేన పార్టీది కీలకమైన పాత్ర వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పటిష్టమైన భద్రత ఇవ్వాలని ఎన్డీయే సమావేశంలో కోరారని పవన్ తెలిపారు.
ALso Read: ప్రాసిక్యూషన్‌కు రెడీ .. అరెస్ట్‌కు ఓకే, నన్ను చిత్రవధ చేసుకో : జగన్‌కు పవన్ కళ్యాణ్ సవాల్
తనను ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. పొరపాటున మానభంగాలు జరిగిపోతాయని మంత్రులు అన్నారు.. వారిని ప్రాసిక్యూట్ చేయరా అని ఆయన ప్రశ్నించారు. తాను దెబ్బలు తినడానికి సిద్ధంగానే వున్నానని పవన్ పేర్కొన్నారు. తాను ఒక మాట అన్నానంటే అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడుతానని జనసేనాని తెలిపారు. 23 అంశాలతో కూడిన డేటాను వాలంటీర్లు కలెక్ట్ చేస్తున్నారని.. వాలంటీర్లు సేకరించే సమాచారం డేటా ప్రొటెక్షన్ కిందకు వస్తుందని పవన్ చెప్పారు.
డేటా చౌర్యం చాలా తీవ్రమైన నేరమని ఆయన తెలిపారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడాకు ఏపీ ప్రజల డేటా వెళ్తోందని.. ఎఫ్‌వోఏ , మరో మూడు కంపెనీలు ఎవరివి అని పవన్ ప్రశ్నించారు. డేటా చౌర్యాన్ని కేంద్రం దాకా తీసుకెళ్తానని.. నీ ప్రభుత్వాన్ని కిందకు లాగేది ఇదేనంటూ జగన్‌ను హెచ్చరించారు. వైసీపీ నేతల మైనింగ్ అక్రమాలు, దోపిడీలు అన్ని బయటకు తీస్తానని.. మీ ప్రభుత్వానికి, మీకు రోజులు దగ్గరపడ్డాయని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALso Read: జగన్‌ను ఇంటికి పంపుతా.. కుదిరితే చర్లపల్లి జైలుకు కూడా : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో కింది స్థాయి అధికారి తప్పు చేస్తే పై అధికారికి ఫిర్యాదు చేయొచ్చని.. వాలంటీర్ 8 ఏళ్ల బిడ్డను రేప్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అసలు వాలంటీర్లకు అధిపతి ఎవరు అని ఆయన నిలదీశారు. జనవాణి కార్యక్రమానికి స్పూర్తినిచ్చింది ఓ మహిళా వాలంటీర్ అని పవన్ గుర్తుచేశారు. తాడేపల్లిలో సీఎం ఇంటికి సమీపంలో రోడ్ వైడ్‌నింగ్‌లో ఇల్లు పోయింది, న్యాయం చేయమని తనను ఆ వాలంటీర్ కోరిందని ఆయన తెలిపారు.
దీనిపై తాను మాట్లాడినందుకు ఆమె అన్నయ్యని చంపేశారని.. ఇప్పటికీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇవ్వలేదని పవన్ దుయ్యబట్టారు. జగన్‌కు తన మన అన్న భేదం లేదని.. అనకొండలా అన్నీ మింగేస్తాడని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ నుంచి జనసేనలోకి వచ్చినా మనస్పూర్తిగా ఆహ్వానిస్తానని కానీ కమిట్‌మెంట్‌తో పనిచేయాలని పవన్ కల్యాణ్ కోరారు. పంచకర్ల రమేశ్ బాబు ఉత్తరాంధ్రలో జనసేనను విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.