Apollo : నీ DNA లో ఏముందో తెలుసా? అపోలో యూనివర్సిటీ జాతీయ సదస్సులో సంచలన విషయాలు

Published : Feb 12, 2026, 06:53 PM IST
National Symposium on Rare Diseases Held at Apollo University Chittoor

సారాంశం

Apollo University Chittoor: అరుదైన వ్యాధుల గుర్తింపు, జన్యు పరీక్షల ప్రాధాన్యం పై చిత్తూరు అపోలో యూనివర్సిటీలో జాతీయ సదస్సు నిర్వహించారు. వీసీ డా. వినోద్ భట్ అవగాహన పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Rare Diseases Symposium : చిత్తూరులోని ది అపోలో యూనివర్సిటీ లో అరుదైన వ్యాధులపై (Rare Diseases) జాతీయ స్థాయి అవగాహన సదస్సు గురువారం ఘనంగా జరిగింది. ఈ వ్యాధుల పట్ల సమాజంలో అవగాహన పెంచడం, ఆధునిక వైద్య సాంకేతికతను రోగులకు చేరువ చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యూనివర్సిటీలోని బయోమెడికల్ సైన్సెస్ విభాగం, మెడికల్ జెనెటిక్స్ విభాగం, అపోలో హాస్పిటల్స్, సెంట్రల్ రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ సంయుక్తంగా ఈ భారీ సింపోజియాన్ని నిర్వహించాయి.

అవగాహనతోనే విజయం: వీసీ డా. హెచ్‌. వినోద్‌ భట్‌

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అరుదైన వ్యాధులపై పోరాటంలో అవగాహనే మొదటి మెట్టు అని స్పష్టం చేశారు. చాలా వరకు అరుదైన వ్యాధులు సంక్రమణ వ్యాధులు కావు అని, ఇవి ప్రధానంగా జన్యుపరమైన లోపాల వల్ల సంభవిస్తాయని వివరించారు.

ప్రస్తుత కాలంలో ప్రెసిషన్ మెడిసిన్, ఆధునిక జన్యు సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల అరుదైన వ్యాధుల నిర్ధారణ గతంలో కంటే సులభమైందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో కొంత అవగాహన పెరిగినప్పటికీ, మారుమూల ప్రాంతాలకు కూడా ఈ సమాచారం చేరాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ అంతా జన్యు పరిశోధనల చుట్టూనే తిరుగుతుందని డా. భట్ ఉద్ఘాటించారు.

ప్రెసిషన్ మెడిసిన్.. జన్యు విప్లవం

బెంగళూరుకు చెందిన కర్కినోస్ హెల్త్‌కేర్ చీఫ్ డేటా ఆఫీసర్ డా. వినోద్ స్కారియా విశిష్ట అతిథిగా విచ్చేసి 'పర్సనల్ జీనోమ్స్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్' అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. వైద్య రంగంలో జన్యు సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ప్రతి వ్యక్తి జన్యు క్రమం (DNA) భిన్నంగా ఉంటుందని, అందుకే ఒకే మందు అందరికీ ఒకేలా పని చేయకపోవచ్చని వివరించారు. వ్యక్తిగతీకరించిన చికిత్స విధానాల ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలు అందించవచ్చని ఆయన వివరించారు.

శిశువుల్లో జన్యు స్క్రీనింగ్ ప్రాముఖ్యత

ఈ సదస్సులో వర్చువల్ పద్ధతిలో పాల్గొన్న నిపుణులు కీలక అంశాలను ప్రస్తావించారు. డా. వైభవ్ భండారి అరుదైన వ్యాధులపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆధునిక పరిశోధనా విధానాలను వివరించారు. మరో నిపుణురాలు డా. సీమా కపూర్ మాట్లాడుతూ, శిశువులకు జన్యు స్క్రీనింగ్ చేయడం ఎంత ఆవశ్యకమో వివరించారు. పుట్టిన వెంటనే చేసే పరీక్షల ద్వారా కొన్ని రకాల అరుదైన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని, తద్వారా ప్రాణాపాయం నుంచి రక్షించి, సరైన సమయంలో చికిత్స అందించవచ్చని ఆమె స్పష్టం చేశారు.

సదస్సులో పాల్గొన్న ప్రముఖులు వీరే

ఈ జాతీయ సదస్సులో అపోలో యూనివర్సిటీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొ. కె. భాస్కర్‌రెడ్డి, బయోమెడికల్ సైన్సెస్ విభాగాధిపతి ప్రొ. ఆర్. సత్యనారాయణ తమ విశ్లేషణలను పంచుకున్నారు. డా. ఎన్. ఇందుమతి, అధ్యాపకులు డా. జి. గోపికృష్ణ, డా. హేమాద్రి రెడ్డి, డా. సి. సాయికళ్యాణి యోగిని, డా. యు.వి. ప్రసాద్, డా. ఏ.వి.ఆర్. కృష్ణారావు వివిధ సెషన్లలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సింపోజియం కన్వీనర్‌గా డా. ఎం. జీవన్‌కుమార్‌, కో–కన్వీనర్‌గా డా. ఆర్. శ్రీరూప్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు.

విస్తృత స్థాయిలో చర్చలు

అసలు అరుదైన వ్యాధులు అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తాయి? కుటుంబంలో ఒకరికి ఉంటే మిగిలిన వారికి వచ్చే అవకాశం ఉందా? జన్యు పరీక్షలు ఎంతవరకు ఖచ్చితత్వాన్ని ఇస్తాయి? వంటి అనేక సందేహాలపై ఈ సదస్సులో స్పష్టతనిచ్చారు. విద్యార్థులు, పరిశోధకులు, వైద్య నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రశ్నోత్తరాల సెషన్‌లో చురుగ్గా పాల్గొన్నారు. అరుదైన వ్యాధులతో బాధపడే కుటుంబాలకు జన్యు పరీక్షలు ఒక మంచి ఛాన్స్ అని, అవి వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు తేల్చి చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?