ఆంధ్రా కశ్మీర్ కి జాతీయరహదారి

First Published Oct 7, 2017, 12:33 PM IST
Highlights
  • ఆంధ్రా కశ్మీర్ గా పిలుచుకునే ఈ ప్రాంత  అందాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవడనంలో అతిశయోక్తి లేదు.
  • విశాఖ ఏజెన్సీలో గల ప్రాంతాన్ని సందర్శించిన వారు అరకును భూతల స్వర్గంగా అభివర్ణిస్తారు.

అరకులోయ... పరిచయం అక్కర్లేని పేరు.  ఆంధ్రా కశ్మీర్ గా పిలుచుకునే ఈ ప్రాంత  అందాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవడనంలో అతిశయోక్తి లేదు. విశాఖ ఏజెన్సీలో గల ప్రాంతాన్ని సందర్శించిన వారు అరకును భూతల స్వర్గంగా అభివర్ణిస్తారు. అరకులోయకు, మన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ ఓ అద్భుత పర్యాటక ప్రాంతంగా పేరుంది.  అయితే అరకుకు ఇప్పటి వరకు సరైన రవాణా మార్గం లేదు. అయినప్పటికీ ఏటా వేల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. దీని ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అరకు మీదుగా జాతీయ రహదారి నిర్మించడానికి ప్రణాళికలు చేస్తోంది.

ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తైతే.. అరకు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు అరకుకు సరైన రవాణ సదుపాయం లేదు. రైలు మార్గం ఉన్నప్పటికీ అది పరిమితమే. దీంతో.. అరకులో పర్యటించడానికి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ జాతీయరహదారి నిర్మాణంతో ఆ సమస్య ఉండదు. దాంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జాతీయ రహదారితో ఏజెన్సీ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16) మార్గంలో మరో జాతీయ రహదారి 516–ఈను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాజమహేంద్రవరం నుంచి తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లోని రంపచోడవరం, కొయ్యూరు, లంబసింగి, పాడేరు, అరకు, ఎస్‌.కోట మీదుగా విజయనగరం వరకు రెండు వరుసల జాతీయ రహదారిని నిర్మించేందుకు గాను కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

గిరిజన గ్రామాల మీదుగా నిర్మాణం జరిగే ఈ జాతీయ రహదారితో తెలంగాణ నుంచి విశాఖ, విజయనగరం జిల్లాలకు మధ్య దూరం తగ్గనుంది. భద్రాచలంకు ఈ ఏజెన్సీ ప్రాంతాలు దగ్గరగా ఉండటంతో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వారికి ఈ జాతీయ రహదారి వెసులుబాటుగా ఉంటుంది.  

click me!