బతికే ఉన్నా: ఏపీ సచివాలయం ముందు బైఠాయించి బోరుమన్న మహిళ

First Published Jul 2, 2018, 6:37 PM IST
Highlights

బతికుండగానే తల్లిని చంపేసిన తనయులు


హైదరాబాద్: భూమిని దక్కించుకొనేందుకు బతికుండగానే తల్లి చనిపోయిందంటూ  తప్పుడు ధృవీకరణ పత్రాలను  సృష్టించిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని  బాధితురాలు  ఏపీ సచివాలయం ఎదుట సోమవారం నాడు ధర్నా చేసింది.

గుంటూరు జిల్లా పెద్దపల్లికి చెందిన  నర్సమ్మ మహిళకు ఇద్దరు కొడుకులు. భర్త చనిపోయాడు.ఆమె పేరున 71 సెంట్ల భూమి ఉంది. అయితే ఈ భూమిని ఆమె తన కొడుకుల పేరున రిజిష్టర్ చేయలేదు.

కానీ, ఆ భూమిని దక్కించుకొనేందుకు గాను  పెద్ద పథకం వేశారు.  బతికుండగానే తల్లి చనిపోయిందంటూ  తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించారు. డెత్ సర్టిఫికెట్‌ను ఆధారంగా చేసుకొని  తల్లి పేరున ఉన్న 71 సెంట్ల భూమిని ఇద్దరు తమ పేరున రిజిస్టేషన్ చేసుకొన్నారు.

ఈ విషయం తెలిసిన బాధితురాలు  తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కలిసింది. అయితే బాధితురాలి పేరున పాస్ పుస్తకాలు జారీ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కానీ, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం  అమలు చేయలేదని ఆమె ఆరోపిస్తున్నారు.

ఇదే విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలవాలని సోమవారం నాడు సచివాలయం వద్దకు వచ్చారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షను చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్నారు. 

అయితే  బాధితురాలిని సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె సచివాలయం గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. కన్న కొడుకులే తనను మోసం చేస్తే తనను ఎవరు ఆదుకొంటారని ఆమె ప్రశ్నించారు.

click me!