తెలంగాణ ప్రభుత్వాన్ని ఫాలో కండి...: సీఎం జగన్ కు లోకేష్ లేఖ

By Arun Kumar PFirst Published Apr 18, 2021, 2:11 PM IST
Highlights

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. 
 

అమరావతి: ప్రస్తుతం కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. ఈ మేరకు సీఎంకు లోకేష్ లేఖ రాశారు. 

''జూన్ లో మన రాష్ట్రంలో 15 లక్షలకు పైగా విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది. దీనిపై వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమం. ఏపీలో టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదు. పరీక్షల వల్ల కోవిడ్ సోకితే  విద్యార్థుల ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడి నివారించడానికి పరీక్షలు రద్దు చేయటమే ఉత్తమం'' అని సీఎంకు లోకేష్ సూచించారు.

read more  ఏపీలో కోవిడ్ విలయతాండవం: ఒక్కరోజులో 7 వేలకు పైగా కేసులు.. చిత్తూరులో విషమం

''రెండో దశ కోవిడ్ ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనూ కేసుల తీవ్రత రోజు రోజుకూ ఎక్కువవుతుడటంతో పాటు మరణాల రేటు పెరుగుతోంది. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, వెంటిలేటర్ల కొరత అధికంగా ఉంది. గత వారం రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 3000 కొత్త కేసులను నమోదు అయ్యాయి.  తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రజలు  కోవిడ్ బారీన పడకుండా నివారించవచ్చు. అందుకే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ప్రభుత్వం ఆలోచన చేయాలి'' అని తన లేఖలో పేర్కొన్నారు లోకేష్. 

''రాష్ట్రంలో టీకా సామర్ధ్యం పెరిగే వరకు కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి. కేంద్రం ఇప్పటికే సిబిఎస్‌ఈ  పరీక్షలను రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వమూ పదో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు చేసింది. ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు వాయిదా వేసింది. కాబట్టి రాష్ట్రంలోని విద్యార్థుల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలి'' అని లోకేష్ సీఎం జగన్ కు సూచించారు. 
 

click me!