మీ విధానాల వల్లే ఆ రంగం సంక్షోభంలోకి..: జగన్ కు లోకేష్ ఘాటు లేఖ

By Arun Kumar PFirst Published Sep 21, 2020, 6:42 PM IST
Highlights

ప్రస్తుతం ప్రభుత్వ అసమర్థ విధానాలతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని నారా లోకేష్ ఆరోపించారు. 

గుంటూరు: సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.  దేశ వారసత్వ సంపదైన చేనేత రంగంలో ఆంధ్రప్రదేశ్ కి విశేష ప్రాముఖ్యత ఉందని... కానీ ప్రస్తుతం ప్రభుత్వ అసమర్థ విధానాలతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని లేఖలో ఆరోపించారు లోకేష్. 

''నేతన్న జీవనానికి అండగా నిలిచిన ఎన్నో పధకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చెయ్యడం వలన చేనేత ఉనికి ప్రశ్నర్ధకంగా మారుతుంది. రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిపివేత, ఆప్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో నేతన్న బతుకు దినదిన గండంగా మారింది. టిడిపి హయాంలో చేనేత సహకార సంఘంలో ఉన్న వారికి ఒక్కో బారుకు రూ.1,000 వరకు ప్రోత్సాహకం ఉండేది.అంటే ఏటా 40-50 వేల రూపాయల వరకు ప్రోత్సాహకం అందేది.ఈ ప్రోత్సాహకాన్ని వైసీపీ ప్రభుత్వం ఆపేసింది'' అని మండిపడ్డారు. 

''ఇలా కూలితో సంబంధం లేకుండా ఏడాదికి రూ.50 వేలు వచ్చే అదనపు ఆదాయాన్ని నిలిపేసి కేవలం రూ.24 వేలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం కనీసం 10 శాతం కూడా అందటం లేదు. చేనేత రంగం అభివృద్ధికి, కార్మికులకు భరోసా కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్ (ఉద్యోగులకు పీఎఫ్‌ లాంటిది)ను 8 శాతం నుంచి 16 శాతానికి పెంచింది. టిడిపి ప్రభుత్వం 10 శాతం ఉన్న నూలు సబ్సిడీని 40 శాతానికి పెంచింది. ఏడాదిలో 150 రోజులు మాత్రమే రిబేటులు అమ్ముకునే అవకాశాన్ని 365 రోజులకు పెంచింది. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రాయితీ అమలు చేసింది. వీటివల్ల సహకార సంఘాల్లోని చేనేత కార్మికులకు అనేక ప్రోత్సాహకాలు లభించాయి'' అని గుర్తు చేశారు. 

read more   ఏపీలో సీఎంఆర్ఎఫ్ చెక్‌ల కుంభకోణం: సీఐడీకి కేసు బదిలీ చేసే ఛాన్స్

''వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ ఆగిపోయాయి. ఆప్కో ద్వారా కొనుగోళ్లు లేక కోట్ల రూపాయిలు విలువ చేసే ఉత్పత్తులు నేతన్నల వద్దే  పేరుకుపోయాయి. దింతో తయారీ ఆగిపోయి చేనేతపై ఆధారపడిన వారికి ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క కరోనా కష్టాలు మరోపక్క ప్రభుత్వ నిబంధనలతో నేతన్నకు కనీస సహాయం అందడం లేదు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి నేతన్నకి రూ.1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందజెయ్యాలి. కరోనా సంక్షోభ సమయంలో చేయూత ఇవ్వాల్సిన ప్రభుత్వం చేనేత రంగాన్ని గాలికొదిలేసింది. ఎత్తేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు తిరిగి అమలు చెయ్యాలి. చేనేత రంగాన్ని ఆదుకోవాలి'' అంటూ లేఖ ద్వారా సీఎంకు సూచించారు లోకేష్. 

click me!