
అమరావతి: చిత్తూరు జిల్లా పుంగనూర్‌లో చంద్రబాబు ర్యాలీ రక్తసిక్తమైంది. ఆయన ర్యాలీలో ఘర్షణలు జరిగాయి. వైసీపీ శ్రేణులు చంద్రబాబు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. వైసీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు ర్యాలీపై, టీడీపీ వాహనాలపై రాళ్లు రువ్వారని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి భాష్ఫవాయు గోళాలు ప్రయోగించారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసులు గాయపడిన వీడియోలు బయటికి వచ్చాయి. ఈ ఘటనపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తమ అధినాయకుడి ర్యాలీని వైసీపీ అడ్డుకోవాలని హింసకు తెరలేపిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ పుంగనూర్ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు.
మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకుని నారా లోకేశ్ సీరియస్‌గా కామెంట్ చేశారు. పెద్ది రెడ్డి నీ పాపాలు పండే రోజు దగ్గరపడిందని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటన అడ్డుకునేందుకు దాడులకు బరితెగించడం, వారు ఎంత అభద్రతలో ఉన్నారో స్పష్టం అవుతున్నదని తెలిపారు. వైసీపీ గూండాలు రెచ్చిపోతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోసించడం కచ్చితంగా రాజారెడ్డి రాజ్యాంగమే అని విమర్శించారు. వైసీపీ అల్లరి మూకలు రాళ్లు రువ్వుతుంటే.. పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.
పుంగనూర్‌లో ప్రజాస్వామ్యంపై వైసీపీ చేసిన దాడి ఇది మండిపడ్డారు. తమ కార్యకర్తలు చిందిన నెత్తుటిపై ఒట్టేసి చెబుతున్నా పెద్దిరెడ్డి.. నువ్వు చేసిన పాపాలన్నింటికీ కుమిలి.. కుమిలి ఏడ్చే రోజు తెస్తామని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ఈ ఘటన గురించి మాట్లాడుతూ చంద్రబాబు కూడా పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. తనపై బాంబులు వేస్తేనే భయపడలేదని, రాళ్లు వేస్తే భయపడతానా? అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. పెద్దిరెడ్డి ఖబర్దార్.. నీ పతనం అంగుళ్ల నుంచి మొదలైందని వార్నింగ్ ఇచ్చారు.