
అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులపై అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి స్పందించారు. శాంతియుతంగా ఎవరైనా బంద్ చేసుకోచ్చని.. కానీ వెళ్లాల్సిన రూట్‌లో కాకుండా పుంగనూరులో వేరే దారిలో వెళ్లేందుకు చూశారని ఆయన మండిపడ్డారు. బాధ్యులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని డీఐజీ వెల్లడించారు. పుంగనూరు ఇన్‌ఛార్జ్ చల్లా బాబు కేడర్‌ను రెచ్చగొట్టారని అమ్మిరెడ్డి చెప్పారు. రెండు పోలీస్ వాహనాలను తగులబెట్టారని.. మొత్తం 11 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను చంపే ప్రయత్నం చేశారని డీఐజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో టీడీపీ నేతలు ప్లాన్ మార్చి దాడి చేశారని ఆయన తెలిపారు.
అంతకుముందు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాట్లాడుతూ... ముందస్తు ప్లాన్ ప్రకారమే గొడవ చేశారని ఆయన ఆరోపించారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో 2 వేల మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారని రిషాంత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులపై పక్కాప్లాన్ ప్రకారం దాడి జరిగిందని ఆయన తెలిపారు. వాళ్లు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి వుందని.. కానీ వారు అలా వెళ్లకుండా పుంగనూరులోకి వచ్చారని ఎస్పీ చెప్పారు. దీంతో పుంగనూరులోకి రాకుండా టీడీపీ క్యాడర్‌ను అడ్డుకున్నామని రిషాంత్ రెడ్డి వెల్లడించారు.
ALso Read: గూండాలతో, గన్‌లతో ..పక్కా స్కెచ్‌తో పుంగనూరుకి .. అన్నింటికీ చంద్రబాబే ముద్దాయి : పెద్దిరెడ్డి
ఈ నేపథ్యంలో వారంతా ఒక్కసారిగా పోలీసులపై విచక్షణారహితంగా దాడికి దిగారని ఎస్పీ తెలిపారు. 2 పోలీస్ వాహనాలను తగులబెట్టారని.. ఈ ఘటనలో 14 మంది పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. రాళ్లదాడిలో మరో 50 మందికి పైగా గాయాలు అయ్యాయని రిషాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని.. దీని వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టేది లేదని ఎస్పీ తేల్చిచెప్పారు. రాజకీయ కక్షలు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప పోలీసుపై కాదని ఆయన హితవు పలికారు. గొడవ పెట్టుకునేందుకే టీడీపీ కేడర్ ఇక్కడికి వచ్చారని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆరోపించారు.