ఇది సినిమా కాదు, జాగ్రత్త: పవన్ కల్యాణ్ కు సిఎం రమేష్ హెచ్చరిక

First Published Jun 26, 2018, 4:45 PM IST
Highlights

కడప ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు.

కడప: కడప ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. కడప పౌరుషాన్ని రెచ్చగొట్టవద్దని ఆయన హెచ్చరించారు. 

"పవన్ కల్యాణ్ దీక్షను నీరుగార్చేలా వ్యవహరిస్తున్నావు, జాగ్రత్త. కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించు. నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. లేదంటే మీరు ఏం చేస్తారో ప్రకటించండి" అని అన్నారు. 

"దీక్ష పవిత్రతను వక్రీకరిస్తున్న మీ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ఇదేమీ సినిమా కాదు. ప్రజారాజ్యం పార్టీ అంతకన్నా కాదు. నీవు చేసిన ఆరోపణలపై మనమిద్దరమే మాట్లాడుకుందాం. కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేస్తావా? దీక్ష అంటే ఏమనుకుంటున్నావు?" అని మండిపడ్డారు. 
"అసలు నీకు రాజకీయాలు తెలుసా? దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడు. అసలు జిందాల్‌లు నీకు తెలుసా? ఉక్కు దీక్ష భావితరాల కోసం చేస్తున్న దీక్ష అని తెలుసుకో" అని పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. 

మంత్రులు సోమిరెడ్డి, జవహర్‌, ఆదినారాయణరెడ్డి, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ దీక్షా శిబిరాన్ని సందర్శించారు.
 
ఇనుప ఖనిజాన్ని దోచుకుని కోట్లు గడించిన గాలి జనార్దన్‌రెడ్డిని రంగంలోకి దింపేందుకు మోడీ పావులు కదుపుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కడపను అడ్డంపెట్టుకుని ఎదిగిన జగన్‌ ఉక్కు గురించి ఒక్క మాటకూడా మాట్లాడకపోవటం దారుణమని ఆయన అన్నారు. 

వేలాది లోడుల ముడి ఇనుమును అక్రమంగా చైనాకు రవాణా చేసి వేల కోట్లు స్వాహా చేసిన గాలి జనార్దన్ రెడ్డి తాజాగా రంగంపైకి వచ్చి ఫ్యాక్టరీ పెడతానని అనడం విడ్డూరం గా ఉందని అన్నారు. 

సిఎం రమేష్ దీక్షను ప్రారంభించిన తర్వాత మోడీ చెప్పినట్లు గాలి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ రాకుండా రాష్ట్రమే అడ్డుకుంటుందంటూ పవన్‌ చేసిన ప్రకటన ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. 

రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌.. దుష్ట చతుష్టయంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి జవహర్ అన్నారు. అకుంఠిత దీక్షతో చేస్తున్న ఉద్యమాన్ని వైసీపీ నేతలు అవహేళన చేస్తున్నారని ఆయన అన్నారు.

click me!