
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అధికార అండతో వైసిపి అక్రమాలకు పాల్పడిందని... టిడిపి గెలిచిన చోటకూడా వైసిపిని విజేతగా ప్రకటించారని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ ఆరోపించారు. నామినేషన్లు వేసినవారు, ఎన్నికల్లో పోటీచేసినవారిని,గెలిచిన వారినే కాదు చివరకు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించినవారినీ వైసిపి నాయకులు పొట్టనపెట్టుకున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
''తూర్పుగోదావరి జిల్లా నడిపూడి 11వ వార్డు బూత్ ఏజెంట్ రవిశంకర్ ది ఆత్మహత్య కాదు... ముమ్మాటికీ వైఎస్ జగన్ అధికార ఆధిపత్య అహంకారంతో చేసిన దారుణ హత్య. నామినేషన్ వేస్తే చంపేశారు. గెలిస్తే చంపేశారు. చివరికి పంచాయతీ ఎన్నికల ఏజెంట్లనూ వెంటాడి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. అధికారం అండతో ఎన్నికలు అయ్యాక కూడా అరాచకాలు సృష్టిస్తోన్న వైసీపీపై చర్యలు తీసుకోవడంలో ఎస్ఈసీ విఫలమైంది. ఏజెంట్లనే చంపేస్తుంటే, ఇక గెలిచిన అభ్యర్థుల ప్రాణాలకు దిక్కెవరు?'' అంటూ లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
''పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం వైఎస్ జగన్ తొక్కని అడ్డదారులు లేవు. అధికార మదంతో అరాచకాలు సృష్టించారు. అర్ధరాత్రి అధికారులను ప్రలోభాలకు గురిచేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. విజయనగరం జిల్లా, కొత్తవలస గ్రామ పంచాయతీలో టిడిపి బలపర్చిన అభ్యర్థి 260 ఓట్ల గెలిచినా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో వైకాపా గెలిచినట్టు ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు కొంతమంది అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం'' అని ఆరోపించారు.
''చీకటి మాటున గెలిచాం అని ప్రకటించుకున్నా పగలు ధైర్యంగా జనాల్లో తిరగలేని పరిస్థితి వైకాపా నాయకులది. తప్పుడు పనులు చేసి అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొంతమంది అధికారులపై ఎస్ఈసి చర్యలు తీసుకోవాలి. ఆధారాలు పరిశీలించి రీ-కౌంటింగ్ కి ఆదేశించాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.