
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటితో 38వ రోజుకు చేరింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతుంది. బుధవారం (మార్చి 8) అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పాదయాత్ర చేస్తున్న లోకేష్ మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మహిళలకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘అమ్మలేనిది జన్మ లేదు. భూమి కన్నా ఎక్కువ భారం మహిళలపై ఉంది. అలాంటి మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ఈ సమావేశానికి విచ్చేసిన మహిళలకు పాదాభివందనం అంటూ.. మోకాళ్ళపై కూర్చొని వారికి వందనం చేశారు.
దిశా చట్టం పేరుతో సీఎం వైఎస్ జగన్ మహిళలను మోసగించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. దిశ చట్టంతో 21 రోజుల్లో ఎంతమదికి శిక్ష పడేలా చేశారని ప్రశ్నించారు. చట్టాలు అవసరమని.. కానీ చట్టాలతో పాటు మహిళలను గౌరవించాలని నర్సరీ నుంచి పీజీ వరకు పిల్లలకు చెప్పాలని అన్నారు. మహిళలను గౌరవించాలని ఇంట్లో కూడా ఒకటికి పదిసార్లు చెప్పాలని కోరారు. చిన్నప్పుడు తాను అసభ్యంగా మాట్లాడితే తన తల్లి రెండు కొట్టేదని.. ఒక బూతు పదం తన నోరు నుంచి వస్తే ఒప్పుకునేది కాదని తెలిపారు. ఈ రోజు తాను అలా నిలబడుతున్నానని చెప్పారు. తనను సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తిగా తన తల్లితీర్చిదిద్దారని అన్నారు.
మహిళల పట్ల గౌరవం మనసులో ఉండాలని అన్నారు. అలాంటి తల్లినే అవమానించారని.. అందుకు బాధ కలుగుతుందని చెప్పారు. తన తల్లి రాజకీయాలను ఎప్పుడూ దూరంగానే ఉన్నారని చెప్పారు. కుటుంబ పోషణ కోసం వ్యాపారం చూసుకున్నారని.. ఇప్పుడు ఆ పాత్రను బ్రాహ్మణి తీసుకున్నారని.. అందుకే తన తల్లి ఎన్టీఆర్ పేరుతో ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నారని తెలిపారు. అలాంటి తన తల్లిని శాసనసభ వేదికగా అవమానించారని ఆవేదన వ్యక్తం. తన తండ్రి ఏనాడూ ఎడవలేదని.. ఆరోజు మాత్రం కన్నీరుపెట్టుకున్నారని చెప్పారు. తన తల్లి కోలుకోవడానికి నెల రోజులు సమయం పట్టిందని తెలిపారు.
మంత్రి రోజా తనకు ఒక సందర్భంలో తనకు చీర, గాజులు పంపిస్తానని అన్నారని.. అది మహిళలను కించపరిచినట్టేగా అని అన్నారు. చీర, గాజులు వేసుకున్న వాళ్లు చేతకాని వాళ్ల అని రోజాను ప్రశ్నించారు. ఎందుకు మహిళలను అగౌరవపరుస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి.. అదే మద్యంపై డబ్బులు దండుకుంటుందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.