
మంగళగిరి : గ్రావెల్ తవ్వకాల విషయంలో అధికార వైసిపి నాయకులు ఘర్షణకు దిగిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో వైసిపి నాయకులు అక్రమంగా గ్రావెల్స్ తవ్వకాలు చేపట్టారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. చివరకు వాటాల్లో తేడా రావడంతో వైసిపి నాయకులు తన్నుకునే పరిస్థితి ఏర్పడిందని లోకేష్ అన్నారు.
''మంగళగిరిని మోసం చేసిన మోసగాడు ఆర్కే. దోపిడి లో జగన్ ని మించిపోయాడు. నాలుగేళ్ల లో సహజ వనరుల దోపిడి ద్వారా వందల కోట్లు కొట్టేసాడు. రెండు సార్లు గెలిపించిన నియోజకవర్గానికి మేలు చెయ్యకపోగా ఉన్న సహజ వనరులు యధేచ్ఛగా దోచుకుంటున్నాడు'' అని మంగళగిరి ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేసారు లోకేష్.
Read More మూడు రాజధానుల పేరుతో జగన్నాటకం.. అమరావతే ఏపీకి రాజధాని , జనసేన స్టాండ్ ఇదే : తేల్చేసిన పవన్
''ఉండవల్లి కొండకి గుండు కొట్టాడు. కాజా చెరువులో మట్టి దోపిడి, గిరి ప్రదక్షణ పేరుతో మట్టి దోపిడి. ఇప్పుడు ఏకంగా నీరుకొండ క్వారీ వాటాల్లో తేడా వచ్చి వైసిపి నాయకులు నడి రోడ్డు మీద తలలు పగలుగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ఆర్కే దోపిడి, దౌర్జన్యాలకు అడ్డాగా మార్చేశారు'' అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికన ఆందోళన వ్యక్తం చేసారు.
అసలేం జరిగిందంటే:
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకర్గ పరిధిలోని నీరుకొండ గ్రామంలో వైసిపి నాయకులు గ్రావెల్స్ తవ్వకాలు జరుపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రామ శివారులో అక్రమంగా గ్రావెల్స్ తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ గ్రావెల్స్ తరలింపు విషయంలో వైసిపికే చెందిన తాడిబోయిన వెంకటేశ్వర రావు, తోట నరసింహారావు వర్గాల మధ్య గొడవ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ట్రాక్టర్లలో గ్రావెల్స్ నింపే సమయంలో ఘర్షణ జరగి సద్దుమణిగింది. కానీ రాత్రి మళ్ళీ ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభంమై ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో 9మందికి తలలు పగిలి గాయాలపాలయ్యారు.
ఇలా వైసిపి వర్గీయుల గొడవతో మంగళగిరిలో గ్రావెల్స్ తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో నారా లోకేష్ గ్రావెల్స్ అక్రమ తవ్వకాలే కాదు సహజవనరులు అన్నింటినీ ఎమ్మెల్యే ఆర్కే దోపిడీ చేసి కోట్లు సంపాదిస్తున్నాడని లోకేష్ ఆరోపించారు.