మీరు జగన్ మాఫియా రెడ్డి ప్రైవేట్ సైన్యమా..: చిత్తూరు మాజీ మేయర్ తో పోలీసుల తీరుపై లోకేష్ సీరియస్

By Arun Kumar PFirst Published Jun 24, 2022, 4:08 PM IST
Highlights

చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసులు వాహనాన్ని ఎక్కించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వైఎస్ జగన్ మాఫియా రెడ్డి ఫ్యాక్షన్ నడిపే ప్రైవేట్ సైన్యంలా పోలీసులు వ్యవహరిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.  

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ చిత్తూరు నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్ కఠారి హేమలత, ఆమె అనుచరులతో పోలీసులు వ్యవహరించిన తీరును టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పబట్టారు. మాజీ మేయర్ అని కాదు కనీసం మహిళ అని కూడా చూడకుండా ఆమెను పోలీస్ వాహనంతో ఢీకొట్టి గాయపర్చడంపై సీరియస్ అయ్యారు. అర్థరాత్రి ఓ మహిళ పట్ల పోలీసులు ఇంత అమానుషంగా వ్యవహరించడం సిగ్గుచేటని లోకేష్ మండిపడ్డారు. 

''హత్యకేసులో సాక్షులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడమే మాజీ మేయర్ హేమలత చేసిన నేరమా పోలీసులూ! మీరు ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న పోలీసులా! వైఎస్ జగన్ మాఫియా రెడ్డి ఫ్యాక్షన్ నడిపే ప్రైవేట్ సైన్యమా? పోలీసులే అమాయకుడైన పూర్ణ జేబులో గంజాయి పెట్టి అమ్ముతున్నాడని అరెస్టు చేయడం... ఇదేం అన్యాయం అని నిలదీసిన హేమలత మీద నుంచి పోలీసు వాహనం పోనిచ్చారంటే వీళ్లంతా పోలీసులు కాదు. వైసీపీ ఫ్యాక్షన్ టీం'' అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. 

గురువారం అర్థరాత్రి చిత్తూరులో చోటుచేసుకున్న ఘటనపై ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. టీడీపీ మహిళా నేత, చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతకైనా తెగిస్తున్నారన్నారు. హేమలత ఏం నేరం చేసిందని పోలీసులు అంత దుర్మార్గంగా ఆమెపై జీపుతో తొక్కించారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. 

''ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, నిరంకుశ పాలనను ఎదురిస్తే వైసీపీ నేతలు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదనడానికి చిత్తూరు ఘటనే నిదర్శనం. తన అత్తమామల హత్య కేసులో సాక్ష్యులను బెదిరించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని హేమలత చెప్పడం పోలీసులకు నేరంగా కనిపించిందా? వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పోలీసులు ఇంతలా దిగజారడం సిగ్గుచేటు. పోలీస్ వ్యవస్థకే అవమానం'' అని మండిపడ్డారు. 

''దేశంలో ఎక్కడా లేని విధంగా కొందరు పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా మారారు. బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి వారిపైనే ఎదురు కేసులు పెట్టడమేంటి? జీపుతో తొక్కించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించారని హేమలతతో పాటు ఆమె అనుచరులపై ఎదురు కేసు పెట్టడం దేనికి సంకేతం? పోలీసులు ఉన్నది ప్రజల రక్షించడానికా? వైసీపీ నేతల అక్రమాలకు గొడుగు పట్టడానికా?'' అంటూ అచ్చెన్న నిలదీసారు. 

''పోలీసుల భుజాలపై తుపాకులు పెట్టి టీడీపీ కార్యకర్తలను అంతమొందించాలనుకోవడం దుర్మార్గం. వైసీపీ కుట్రలో పోలీసులు పావులు కావొద్దని హెచ్చరిస్తున్నాం. ఈఘటనపై పోలీసుశాఖ స్పందించాలి. హేమలతకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది'' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే...

తన అత్తమామలైన దివంగత మేయర్ కఠారి అనురాధ, మోహన్ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని హేమలత గురువారం సాయంత్రం ఏఎస్పీ జగదీష్ కు వినతి పత్రం సమర్పించారు. ఇది జరిగిన  కొద్ది గంటల్లోనే చిత్తూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మేయర్ దంపతుల హత్య కేసులో హేమలత  అనుచరుడు ప్రసన్న సాక్షిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రసన్న తమ్ముడు పూర్ణ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడంటూ చిత్తూరు టూ టౌన్ పోలీసులు రాత్రి 8 గంటలకు స్టేషన్ కు తీసుకువెళ్లారు. అప్పటికే  పోలీసులు వారి దగ్గరున్న గంజాయి బస్తాలను ఇంట్లో పెట్టేందుకు ప్రయత్నించగా... తాము అడ్డుకున్నట్లు పూర్ణ తల్లి, వదిన చెబుతున్నారు. దీంతో ఓబసపల్లెలో తనకున్న మరో ఇంట్లో ఒక గంజాయి బస్తా పెట్టారని ఆరోపిస్తున్నారు. తమ ఇంట్లో గంజాయి పెట్టి అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని పూర్ణ ఆందోళనకు దిగారు. 

విషయం తెలిసి అక్కడికి వెళ్లిన హేమలత, పలువురు టీడీపీ నేతలు అక్కడికి వచ్చి ఆ బస్తాల్లో ఏముందో చూపించాలని పోలీసులను అడిగారు. అవన్నీ చూపించడం కుదరదంటూ పూర్ణను మళ్లీ జీపులోకి ఎక్కించారు. అతడిని కిందికి దించాలంటూ హేమలత, నేతలు జీపు వెనక వైపునకు వెళ్లి అడ్డుగా కూర్చున్నారు. జీపును రివర్స్ చేసే క్రమంలో హేమలత కాళ్లపై నుంచి వెళ్ళిపోయింది. గాయపడిన ఆమెను హుటాహుటిన నేతలు, అనుచరులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు కాళ్ల ఎముకల్లో స్వల్పంగా పగుళ్లు వచ్చినట్లు వైద్యులు చెప్పారు.  

 

click me!