
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ విషయంపైనే కాకుండా రాయలసీమ రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. మరీముఖ్యంగా తాజాగా వర్షాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే అవకాశమున్న వేరుశనగ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు లోకేష్.
సీఎం జగన్ కు లోకేష్ రాసిన లేఖ యధావిధిగా...
తేదీ: 04-09-2020
గౌరవనీయులైన
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు
విషయం: వర్షాభావంతో రాయలసీమలో ఎండిపోతున్న వేరుశనగ పంటకు నీరందించాలి, పంటనష్టం ఎన్యూమరేషన్ జరగాలి, బకాయి వున్న పంటనష్టపరిహారం చెల్లింపు గురించి
రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇప్పటికే రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానానికి చేరే ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంటలు ఎండిపోయి, పెట్టిన పెట్టుబడులు తిరిగిరాని రైతులు మరణమే శరణం అంటున్నారు.
ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని వేరుశనగ రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా వుంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ తరువాత అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా రికార్డుల్లో నమోదైన అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు అనావృష్టి సెగ తగిలింది. నీరులేక పంట ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. కీలకమైన ఊడ, పిందె దశలో ఉన్న వేరుశనగ పంటకు తడి లేకపోతే ఊడలు మొద్దుబారి పిందెలు మగ్గిపోయే ప్రమాదం ఉంది.
పంట సాగు చేసిన తర్వాత వరుస వర్షాలతో దిగుబడిపై ఆశలు ఊరించాయి. అయితే ఇప్పుడు ఎండ తీవ్రత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి పంట రక్షించుకునేందుకు తడులు అందించే ఏర్పాటు చేయాల్సిన అత్యవసరం వుంది. అనంతపురం జిల్లాలో 12,20,729 ఎకరాల్లో వేరుశనగ వేశారు. ఎకరాకు రూ.16250 చొప్పున మొత్తం రూ.1988 కోట్లు రైతులు విత్తనాలు, వ్యవసాయ పనులు, ఎరువులకు ఖర్చు చేశారు. ఇప్పుడు వేరుశనగకు రక్షకతడులు అందకపోతే మొత్తం 12 లక్షలకు పైగా ఎకరాలలో పంట పోయినట్టే. ఇదే జరిగితే కేవలం రైతులు పెట్టిన పెట్టుబడే 2 వేల కోట్లకు పైగా నష్టపోనున్నారు.
పంటకు తడి అందించి నిలబెట్టినా కనీసం కూలీల ఖర్చులైనా వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేరుశెనగ నష్టంపై ఎన్యూమరేషన్ నిర్వహించాలి. నష్టపోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించి వేరుశెనగ రైతులను ఆదుకోవాలి.
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2019లో 1,029 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. రైతుల్ని ఆదుకోకపోతే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయే ప్రమాదం వుంది. అలాగే అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు ప్రభుత్వం బకాయి ఉన్న నష్టపరిహారం రూ.967కోట్లు తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
నారా లోకేష్,
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.