తండ్రి చంద్రబాబును జైల్లో పెట్టి, తనను విచారణ పేరిట వేధించడమే కాదు తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసారు.
ఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబును అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు నారా లోకేష్ ఫిర్యాదు చేసారు. అలాగే తనను కూడా కేసుల్లో ఇరికించి విచారణ పేరుతో వేధిస్తున్నారని అమిత్ షా కు వివరించారు. చివరకు తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు లోకేష్.
బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో నారా లోకేష్ భేటీ అయ్యారు. తన తండ్రిపై పెట్టిన కేసులు, గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంచడం, కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి అమిత్ షా కు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా వ్యక్తిగతంగా కక్షసాధింపుకు దిగాడని లోకేష్ అమిత్ షా కు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు తనపై పెట్టిన కేసుల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నట్లు లోకేష్ వెల్లడించారు. దీంతో కేసుల వివరాలతో పాటు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో ఈ కేసులపై సాగుతున్న విచారణ గురించి కూడా అమిత్ షా కు వివరించారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబుపై కేసులు పెట్టి వేధించడం మంచిదికాదని కేంద్ర హోంమంత్రి అభిప్రాయపడ్డట్లు లోకేష్ వెల్లడించారు.
Read More చంద్రబాబుకు షాక్: రైట్ టూ ఆడియెన్స్ పిటిషన్లు డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అన్ని పరిణామాలను పరిశీలిస్తున్నానని అమిత్ షా అన్నారని లోకేష్ తెలిపారు. చంద్రబాబు అనారోగ్యం గురించి తెలిసి ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలావుందని హోంమంత్రి అమిత్ షా అడిగినట్లు లోకేష్ తెలిపారు.
లోకేష్ తో పాటు తెలంగాణ, ఏపీ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురంధరేశ్వరి కూడా అమిత్ షాను కలిసారు. వీరుకూడా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది.
ఇక స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబు గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే వున్నారు. ఆయనను బెయిల్ పై బయటకు తీసుకువచ్చేందుకు టిడిపి సుప్రీం కోర్టు లాయర్లను రంగంలోకి దింపింది. కానీ చంద్రబాబు బయటకు వస్తే ఈ కేసును ప్రభావితం చేయవచ్చన్న సిఐడి లాయర్ల వాదిస్తున్నారు. దీంతో ఏసిబి కోర్టుతో పాటు హైకోర్టు సైతం చంద్రబాబుకు బెయిల్ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో కేవలం ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబు జైలునుండి బయటకు వస్తాడనుకున్న టిడిపి శ్రేణులకు నెల రోజులు గడిచినా ఎదురుచూపులు తప్పడంలేదు.
ఇక చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసినట్లే లోకేష్ ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గత రెండ్రోజులుగా ఈ కేసులో సిఐడి విచారణకు లోకేష్ హాజరవుతున్నారు. అయితే ఏ క్షణమైనా లోకేష్ ను అరెస్ట్ చేయవచ్చని... అందువల్లే ఆయన డిల్లీలో వుంటున్నట్లు వైసిపి నాయకులు చెబుతున్నారు.