
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. ఈరోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నలోకేష్,బ్రాహ్మణిలు.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు లోనికి వెళ్లారు. వీరితో పాటు టీడీపీ నేత మంతెన సత్యనారాయణ రాజు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో లోకేష్ పలు రాజకీయ అంశాలను చర్చించినట్టుగా తెలుస్తోంది.జనసేన-టీడీపీ సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై కూడా లోకేష్‌కు చంద్రబాబు పలు సూచనలు చేసే అవకాశం ఉంది.
ఇక, నేడు రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రానున్న ఎన్నికల్లో కూటమిగా ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించిన టీడీపీ, జనసేనలు.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహరచన చేసి రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై ఇరు పార్టీల నేతలు చర్చించనున్నారు.
ఇదిలాఉంటే, ఏపీ ప్రజలకు నారా లోకేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మంచి సాధించబోయే విజయానికి సంకేతం విజయదశమి సంబరం. చెడుకి పోయేకాలం దగ్గర పడటం దసరా సందేశం. ప్రజల్ని అష్టకష్టాలు పెడుతోన్న జగనాసురుడి పాలన అంతమే పంతంగా అంతా కలిసి పోరాడదాం. అదే మన రాష్ట్రానికి అసలు సిసలు విజయం తెచ్చే విజయదశమి. అందరికీ దసరా శుభాకాంక్షలు’’ అని లోకేష్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
నారా బ్రాహ్మణి కూడా ఎక్స్ వేదికగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేయడానికి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసింది. విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడుదాం!’’ అని బ్రాహ్మణి పేర్కొన్నారు.