
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈరోజు చంద్రగిరి మండలో కాశీపెంట్లలో భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా కాశిపెంట్ల సమీపంలో గోకుల్ హెరిటేజ్ రెండో పార్లర్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం పార్లర్‌లోని వస్తువులను కొనుగోలు చేసి ఉద్యోగులు, అక్కడికి వచ్చిన గ్రామస్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. హైవేలో వెళ్లే ప్రయాణికులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించడమే తమ ఉద్దేశమని చెప్పారు.
తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజల కోసం పోరాడుతున్నాడని భువనేశ్వరి అన్నారు. ‘యువగళం’ పాదయాత్ర రేపు 200వ రోజుకు చేరుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల్లో కొంతమంది వెళ్లి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతామని చెప్పారు. టీడీపీ క్యాడర్‌లో స్థైర్యం నింపేందుకే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేశ్‌కు దేవుడు అన్ని శక్తులూ ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు.
ఇదిలాఉంటే, మంగళవారం రోజున నారా భువనేశ్వరి.. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కుప్పంలో ఏర్పాటు చేసిన సంజీవని ఉచిత వైద్యశాలను ప్రారంభించడంతో పాటు, శాంతిపురం మండలం కడపల్లె సమీపంలోని శివపురం వద్ద వారి సొంతింటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ట్రస్టు సేవల ద్వారా కుప్పం రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. కుప్పం తమ కుటుంబం అని.. ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు చంద్రబాబునాయుడు సంకల్పంతో పురుడు పోసుకున్నదని చెప్పారు. వరుసగా చంద్రబాబును గెలిపిస్తున్న కుప్పం కుటుంబ సభ్యుల అభిమానానికి ఏమిచ్చినా రుణం తీరదని అన్నారు.
అందుకు కృతజ్ఞతగా ఉచిత వైద్య శాలను, దానికి అనుబంధంగా మొబైల్ వ్యాన్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఎన్టీఆర్ ట్రస్టు కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలందించిందని తెలిపారు. గతంలో టీడీపీ కుప్పం నియోజకవర్గానికి ఏం చేసిందనేది కూడా వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా.. తమ సొంత ఇంటి నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని, అది పూర్తైతే కుప్పం ప్రజలకు మురింత దగ్గరగా ఉండేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడారు. లోకేశ్ పాదయాత్ర నిర్వహించాలని భావించినప్పుడు ముందు ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. పాదయాత్రలో లోకేశ్ రాటు తేలిపోయారని, ఇక ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజల కోసం లోకేశ్ పాదయాత్ర పూర్తి చేసి తీరతారని అన్నారు.