
Pawan Kalyan: అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ (Raksha Bandhan) పండుగ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పేర్కొన్నారు. కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక అని, ఈ పర్వదినం సందర్భంగా తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అక్కాచెల్లెళ్లు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆడపడుచులకు అండగా ఉంటామని రక్ష కట్టించుకుంటున్న మనం.. మన కళ్లెదుట ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మన సమాజం, ముఖ్యంగా ప్రభుత్వాలు మౌనంగా ఉండడం శ్రేయస్కరం కాదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని చెబుతున్న అధికారిక గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అదృశ్యాల గురించి ప్రభుత్వంలోని పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే మన ఆడబిడ్డల గతేంటి? అని జనసేనాని నిలదీశారు.
వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలు వినేవారు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపడుచుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించినప్పుడే నిజమైన రక్షాబంధన్ అని, ఆ రోజు రావాలని పవన్ కళ్యాణ్ ఆశించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని మహిళలు అందరికీ ఈ శ్రావణ పౌర్ణమి శుభాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.