తన భర్త నారా చంద్రబాబు నాయుడు సెలక్షన్ ఎలా వుంటుందో సరదాగా చెప్పుకొచ్చారు భువనేశ్వరి. నిత్యం రాజకీయాలు, పాలనావ్యవహారాలతో బిజీగా వుండే చంద్రబాబును తనకు ఇచ్చిన గిప్ట్ ఏమిటి, అదెలా వుందో తెలిపారు.
Nara Bhuvaneshwari : చీర ... మహిళలకు ఓ ఎమోషన్. మరీముఖ్యంగా పెళ్లయిన మహిళలకు చీరలంటే మహాఇష్టం ... బీరువా నిండ చీరలున్నా కొత్త చీర కనిపిస్తే చాలు కొంటుంటారు... కాదు కాదు మొగుళ్ల చేత కొనిపిస్తుంటారు. ఇందుకు ఏ మహిళా అతీతం కాదని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాటలను బట్టి అర్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడూ గంభీరంగా వుండే చంద్రబాబుతో కూడా చీర కొనిపించుకున్నారట భువనేశ్వరి. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టారు.
నారా భువనేశ్వరి 'చీర' కథ :
ఆమె మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముద్దుల కూతురు. ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య ... మంత్రి నారా లోకేష్ కు తల్లి. అంతేకాదు హెరిటేజ్ సంస్ధను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్న ఓ వ్యాపారవేత్త. ఇలా వ్యాపారవేత్తగా సాటి మహిళకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఆమె వున్నారు. కానీ ఆమె కూడా ఓ ఇంటి ఇల్లాలేగా... అందుకే ఏ స్థాయిలో వున్నా భర్త ప్రేమను కోరుకోవడం సహజమే.
అయితే భువనేశ్వరి భర్త మామూలు వ్యక్తి కాదు... ఆయనో ముఖ్యమంత్రి, ఓ రాజకీయ పార్టీ అధ్యక్షులు. దీంతో నిత్యం రాష్ట్ర వ్యవహారాలు లేదంటే పార్టీ వ్యవహారాలతో బిజీగా వుంటారు. అలాంటి చంద్రబాబు నాయుడుతో కూడా ఓ చీర కొనిపించుకుని భార్యగా సంబురపడిపోయారట. ఇలా తన భర్త తెచ్చిన చీర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు భువనేశ్వరి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ ఏం కావాలో తెలిసిన చంద్రబాబుకు భార్యకు ఎలాంటి చీర తీసుకోవాలో తెలియదట. పెళ్లయిన దశాబ్దాల తర్వాత తాను పట్టుబడితే ఓ చీర తెచ్చారని... దాన్ని చూడగానే తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ భువనేశ్వరి సరదా కామెంట్స్ చేసారు. భర్త చంద్రబాబు తెచ్చిన చీర రంగు ఘోరమని అన్నారు. అయితే ఆ చీర ఎలావున్నా అది నా మొగుడు ప్రేమతో తెచ్చాడు... కాబట్టి అది తనకెంతో ఇష్టం... అందువల్లే దాన్ని భద్రంగా బీరువాలో దాచుకున్నాను అంటూ ఓ భార్యగా మురిసిపోయారు నారా భువనేశ్వరి.
ఇలా నారా భువనేశ్వరి భర్త తెచ్చిన చీరగురించి సరదాగా చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలను నెటిజన్లు కూడా సరదా కామెంట్స్ చేస్తున్నారు. అర్థం చేసుకునే భార్య వుంటే చంద్రబాబు, భువనేశ్వరి మాదిరిగా దాంపత్యం అన్యోన్యంగా వుంటుందని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు, టిడిపి శ్రేణులు భువనేశ్వరి మాట్లాడిన వీడియోపై ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు.