సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం.. వైసీపీ అధినేత జగన్ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. వైసీపీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ.. పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు అండగా ఉండాలని... అధికార పార్టీ దాడులకు బెదిరిపోవద్దని ధైర్యం నూరిపోస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధ నుంచి మెల్లగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే భవిష్యత్తు కార్యాచరణపై తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్దేశం చేసిన జగన్... తన సొంతం నియోజకవర్గం పులివెందులను సందర్శించారు. అక్కడ తన కేడర్, అనుచరులను కలిసి చర్చలు జరిపారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
అనంతరం బెంగళూరు వెళ్లిన జగన్.. అక్కడ కొద్దిరోజులు గడిపారు. వ్యక్తిగత, ఇతర పనులను ముగించుకొని తాడేపల్లికి మంగళవారం తిరిగి చేరుకున్నారు. ఈ మధ్యలో బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను జగన్ కలిశారని... వైసీపీ విలీనం గురించి చర్చలు జరిపారన్న వదంతులు వ్యాప్తి చెందాయి. అయితే, ఆ వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. జగన్ వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోరాటం చేస్తారని తెలిపారు.
ఇవన్నీ పక్కన బెడితే... మంగళవారం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న జగన్.. భవిష్యత్తు కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా జూలై 4న నెల్లూరులో ఆయన పర్యటించనున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టయి.. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డిని పరామర్శించనున్నారు. ఇందుకోసం వైసీపీ ఏర్పాట్లు పూర్తిచేసింది.
కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 4వ తేదీ ఉదయం 9.40 గంటలకు హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి బయలుదేరు. 10.30 గంటలకు నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి.. నెల్లూరు సెంట్రల్ జైల్ చేరుకుంటారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్‌లో భాగంగా కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుని హెలికాప్టర్‌లో తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు.
ఈ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ మాట్లాడే అవకాశం ఉంది.
కేడర్‌లో ధైర్యం నింపుతూ...
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం.. వైసీపీ అధినేత జగన్ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహించి.. ఓటమికి గల కారణాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు అండగా ఉండాలని... అధికార పార్టీ దాడులకు బెదిరిపోవద్దని ధైర్యం చెప్పారు. దాడులకు గురైన పార్టీ కేడర్‌కు అండగా ఉండాలని నేతలకు స్పష్టం చేశారు. త్వరలోనే తాను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వస్తానని... సిద్ధంగా ఉండాలని కేడర్‌కు తెలియజేశారు.
అయితే, ఈ నెల 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జగన్ ఇడుపులపాయ వెళ్లి.. తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ జగన్ మళ్లీ ఓదార్పు యాత్రలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టే ఆలోచనలో ఉంటే ఇక్కడి నుంచే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.