ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం... వైఎస్ జగన్ ఏ అధికారాలు లేని సాధారణ ఎమ్మెల్యే. కానీ ఎక్కడో పవన్ కు జగన్ భయం వున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. ఇంతకూ పవన్ ఏమన్నారంటే...
pawan Kalyan : రాజకీయ అనుభవం లేదన్నారు... పదేళ్లకు పైగా ఓపిగ్గా ప్రజల్లోనే వుంటూ రాజకీయాలపై పట్టు సాధించారు. ఫలితంగా ఒక్క సీటు సాధించిన స్థాయినుండి అసలు ఒక్కసీటు కూడా ఓడిపోని స్థాయికి జనసేన ప్రస్థానం సాగింది. దీంతో సినిమాల్లో పవర్ స్టార్ కాస్త రాజకీయాల్లో పవర్ ఫుల్ స్టార్ అయ్యారు. ఇలా పవన్ కల్యాణ్ తనను విమర్శించివారు, ఎగతాళి చేసినవారే పొగిడేంతగా రాజయాల్లోనూ సక్సెస్ అయ్యారు.
అయితే ఎంతో పట్టుదలతో రాజకీయ అనుభవం సాధించిన పవన్ ఇప్పుడు పాలనా అనుభవం సాధించేపనిలో పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగానే కాదు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక వంటి కీలక మంత్రిత్వశాఖలు పవన్ నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి పాలనా అనుభవం లేకపోయినా తెలియని వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకుంటూ... తెలిసినవి తన స్టైల్లో చేసుకుంటూ పోతున్నారు పవన్. ఇలా రాజకీయాలపై పట్టు సాధించినట్లే పాలనపైనా పట్టు సాధించే పనిలో వున్నారు పవన్.
ఈ క్రమంలోనే మంత్రిగా తన పనితీరు గురించి పవన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. తన వద్దకు వచ్చే ఫైల్స్ ను పూర్తిగా పరిశీలించాకే సంతకం చేస్తున్నానని... దీంతో బుర్ర వాచిపోతోందని పవన్ అన్నారు. అయితే అందరు మంత్రులు ఇలా ఫైల్ మొత్తాన్ని చదవరట... కేవలం నోట్ చూసి సంతకం చేసేస్తారని అధికారులు చెప్పినట్లు పవన్ వెల్లడించారు. తనను కూడా అలాగే నోట్ చూసి సంతకం చేయాలని... అలాగయితేనే మీకు ఈజీగా వుంటుందని అధికారులు సూచిస్తున్నారని తెలిపారు.
అయితే ఇలా చూసిచూడకుండా సంతకాలు పెట్టాలంటే తనకు భయమేస్తోందని పవన్ అన్నారు. ఏ ఫైల్ లో ఏముందో తెలియకుండా సంతకం పెట్టడం ఎలా..? రేప్పొద్దున సంతకం పెట్టానంటూ తనను జైల్లో పెట్టే పరిస్థితి రావచ్చు... అందువల్లే ప్రతి ఫైల్ ను పూర్తిగా పరిశీలించాకే సంతకం చేస్తానని పవన్ తెలిపారు.
ఇక తన చదువుపై తానే సరదా కామెంట్స్ చేసారు పవన్. ఇంటర్మీడియట్ పూర్తికాగానే డిగ్రీ... ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే బావుండేది... దీంతో చదువు పూర్తయ్యేదని అన్నారు. అలా కాకుండా ఇంటర్ తో చదువు ఆపేయడంవల్ల ఇప్పుడు చదవాల్సి వస్తోందని... తన మంత్రిత్వ శాఖలకు చెందిన ఫైల్స్ చదివిచదివి అలసట వస్తోందన్నారు. ఇలా తాను ఇంటర్మీడియట్ తో చదుువు ఆపేయడంవల్లే ఇప్పుడు చదవాల్సి వస్తోందంటూ పవన్ సరదాగా కామెంట్స్ చేసారు.
పవన్ భయం అదేనా..?
పైళ్లపై సంతకం పెట్టాలంటే భయంగా వుందంటూ పవన్ ఆషామాషీగా అనలేదని అర్థమవుతోంది. ఆయన నవ్వుకుంటూ సరదాగానే ఈ కామెంట్స్ చేసి వుండవచ్చు... కానీ వాటివెనక అంతరార్థం దాగివుంది. గతంలో వైసిపి ప్రభుత్వం పాలనాపరమైన నిర్ణయాలను కూడా రాజకీయం చేసారని... కక్షసాధింపు కోసమే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసారని పవన్ పరోక్షంగా చెప్పారు. పాలనాపరమైన నిర్ణయాల్లో బాగమే గతంలో సీఎంగా వున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్... ఇది ప్రభుత్వ నిర్ణయం. కానీ దీన్ని చంద్రబాబుకు ముడిపెట్టి అరెస్ట్ చేయడంపై పరోక్షంగా స్పందించినట్లున్నారు పవన్. అందువల్లే ఫైళ్లపై సంతకం చేయడానికి భయంగా వుందంటూ పవన్ చమత్కరించారు.
పవన్ టోన్ మారిందేంటి..?
ఎన్నికల సమయంలో పవన్ స్పీచ్ లు పూనకాలు వచ్చినట్లుగా వుండేవి. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు... వైసిపి వాళ్ల పనిపడతా, వాళ్లను పాతాళానికి తొక్కేస్తా అంటూ పదునైన మాటలతో పవన్ స్పీచులు సాగేవి. పవన్... ఇది సినిమా షూటింగ్ కాదు ఊగిపోతూ మాట్లాడేందుకు,,, అంటూ వైసిపి వాళ్లు విమర్శలు కూడా చేసారు. ఇలా ఎన్నికలకు ముందువరకు పవన్ అంటే ఆవేశపూరిత రాజకీయ నాయకుడిగా పేరుంది.
అయితే ఎన్నికలు ముగియగానే పవన్ పూర్తిగా మారిపోయారు. ఆయనలో ఆవేశపు ఆనవాళ్లే కనిపించడంలేదు... అంతేకాదు జనసేన, టిడిపి, బిజెపి శ్రేణులను కక్షపూరిత రాజకీయాలు వద్దంటూ హితబోద చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఇప్పుడు వాటన్నింటిని పక్కనబెట్టి పాలనపైనే దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. అధికారం చేతిలో వుందికదా అని మేము కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తే వైఎస్ జగన్ కు, మాకు తేడా ఏముంటుందని అంటున్నారు. ఇలా కాషాయం కట్టిన ఏపీ డిప్యూటీ సీఎం సౌమ్యూడిలా మారిపోయారు. ఇప్పుడాయనను చూసినవారు ఎన్నికల్లో చూసిన పవనేనా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జనసైనికులు, మెగా ఫ్యాన్స్ కు మాత్రం పవన్ టోన్ మారడం నచ్చకున్నా... రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ మార్పు చాలా మంచిదంటున్నారు. రాజకీయాల్లో ఆవేశం పనిచేస్తుంది... పాలనలో కాదు... పవన్ ఇప్పుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం... కాబట్టి ఆయనిలా హుందాగా వుండటమే కరెక్ట్. బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఆయన చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ఆవేశంతో ఊగిపోయే ప్రసంగాలతో ప్రజలకు దగ్గరైన పవన్ ఇప్పుడు సుపరిపాలనతో దగ్గరవయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.