
నంద్యాల ఉపఎన్నిక ఫలితం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ నే ఇచ్చింది. 2014 ఎన్నికల తర్వాత వచ్చిన మొదటి ఉపఎన్నికిది. మూడున్నరేళ్ళుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్నారని జగన్ ఇంత కాలం ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకూపడిపోయేవారు. ఉపఎన్నిక ప్రచారంలో కూడా జగన్ అదే చేసారు. ఏకంగా 13 రోజుల పాటు ఊపిరి సలపనంతగా అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి విజయం కోసం కష్టపడ్డారు. కడప, పులివెందులలో కూడా జగన్ ఈ స్ధాయిలో తన కోసం ఎప్పుడూ ప్రచారం చేసుకుని ఉండరు.
ప్రచారమైపోయిన తర్వాత ఎవరికి వారు తామే గెలుస్తున్నట్లు లెక్కలేసుకున్నారు. ఎవరు గెలిచినా మెజారిటీ తక్కువగానే ఉంటుందన్న ప్రచారం కూడా బాగా జరిగింది. దాంతో గెలుపుపై రకరకాల విశ్లేషణలు జరిగాయి. 23వ తేదీ జరిగిన భారీ పోలింగ్ తో నంద్యల రూరల్, గోస్పాడు మండలాల్లో వైసీపీకి తిరుగులేదనుకున్నారు. తీరా చూస్తే జరిగింది విరుద్ధంగా ఉండటంతో జగన్ తో పాటు వైసీపీ నేతలు విస్తుపోతున్నారు.
ఫలితం చూసిన తర్వాత ఎక్కడ తేడా కొట్టిందో వైసీపీ నేతలెవరికీ అర్ధం కావటం లేదు. ఓటర్లను ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు గురిచేయటం, డబ్బులు పంపిణీ, బెదిరింపులకు దిగటం లాంటవన్నీ రాజకీయపార్టీలకు ఎన్నికల్లో సహజం. ఎక్కడ అవకాశం ముంటే, ఎవరికి అవకాశమున్నంతలో వారు చేసుకుంటూనే ఉంటారు. అధికారంలో ఉంది కాబట్టి టిడిపికి సహజంగానే అవకాశాలు ఎక్కువనటంలో ఎటువంటి సందేహం లేదు.
చంద్రబాబునాయుడును ఉద్దేశించి జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మంత్రి భూమా అఖిలప్రియపై వైసీపీ ఎంఎల్ఏ రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీపై కొంత ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషణ జరుగుతోంది. ఏదేమైనా టిడిపి నేతలు చెప్పుకుంటున్నట్లుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలే టిడిపిని గట్టెంకించిందని చెప్పంటలో వాస్తవం లేదు. కేవలం చంద్రబాబు వ్యూహాలు మాత్రమే టిడిపిని గట్టెంకించాయనటంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఇదే విధమైన వ్యూహాలు వైసీపీ నేతలుకూడా వేసి ఉండొచ్చు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారి వ్యూహాలు పారలేదంతే.