నంద్యాలలో గెలవకపోతే కష్టమే

First Published Jun 18, 2017, 8:53 AM IST
Highlights

మంత్రి వైఖరితో రేపటి ఉప ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చంద్రబాబు ఆందోళనలో మొదలైంది. అంటే చంద్రబాబు వేసిన అంచనాకు పూర్తి రివర్స్ లో జరుగుతోంది. ఒకవేళ టిడిపి ఓడిపోతే అఖిలప్రియ ఉద్యోగానికే ఎసరు వచ్చినా ఆశ్చర్య పోవక్కర్లేదు.

నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి గెలవకపోతే మంత్రి అఖిలప్రియకు కష్టమే. పరిస్ధితులు అలాగున్నాయ్ మరి. చిన్న వయస్సులోనే మంత్రి బాధ్యతలు తీసుకున్న అఖిలప్రియకు ఒక్కసారిగా పెద్ద బాధ్యతే వచ్చి పడింది. దాంతో ఏం చేయాలో మంత్రికి తోచటం లేదు. తల్లి మరణంతో ఎంఎల్ఏ అయ్యింది. తండ్రి హఠాన్మరణంతో మంత్రి కూడా అయిపోయింది. అయితే అప్పటి వరకూ తల్లి, తండ్రి చాటునున్న అఖిల ఒక్కసారిగా మంత్రి అయిపోవటంతో పరిస్ధితులను బ్యాలన్స్ చేసుకోలేకపోతోంది.

అఖిలను మంత్రివర్గంలోకి తీసుకుని తప్పు చేసానా? అని చంద్రబాబునాయుడు కూడా అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. భూమా నాగిరెడ్డి మరణంతో సానుభూతి వల్ల ఉప ఎన్నికల్లో టిడిపి గట్టెక్కుతుందని మొదట్లో చంద్రబాబు అనుకున్నారు. అందుకనే అఖిలను మంత్రిని చేసారు. అయితే, వాస్తవ పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్ళలేకపోవటం, సీనియర్లతో ఎలా మెలగాలో కూడా మంత్రికి అర్ధం కావటం లేదు.

అఖిలకు సమస్య ఎక్కడ వచ్చిందంటే తన తండ్రి భూమా నాగిరెడ్డికి పార్టీలోని ఏ గ్రూపుతోనూ పడదు. అందరితోనూ తీవ్రస్ధాయిలో శతృత్వముంది. శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరటం ఇందులో భాగమే. దానికితోడు జనరేషన్ గ్యాప్ అంటూ తన తండ్రికి బాగా సన్నిహితులైన ఏసి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళను కూడా మంత్రి దూరంగా పెడుతున్నారు. అందుకని భూమాకు బాగా దగ్గరైన వాళ్లు కూడా అఖిలకు దూరమైపోతున్నారు.

మంత్రి వైఖరితో రేపటి ఉప ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చంద్రబాబు ఆందోళనలో మొదలైంది. అంటే చంద్రబాబు వేసిన అంచనాకు పూర్తి రివర్స్ లో జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నంద్యాలలోని బలమైన గంగుల కుంటుంతో పాటు శిల్పా మోహన్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. దాంతో చంద్రబాబులో ఆందోళన మరింత పెరిగిపోతోంది. అందుకే శనివారం జిల్లా నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవాల్సిన అవసరాన్ని స్పష్టంగా చెప్పారు. ఒకవేళ టిడిపి ఓడిపోతే అఖిలప్రియ ఉద్యోగానికే ఎసరు వచ్చినా ఆశ్చర్య పోవక్కర్లేదు.

click me!