
‘మళ్ళీ తనకే ఓటేస్తే సేవ చేస్తా’....చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం రైతులతో శనివారం చంద్రబాబునాయుడు అన్న మాటలు. ఒకపుడు ‘రాష్ట్రంలోని 85 శాతం ప్రజలు తన పాలన పట్ల సంతృప్తిగా ఉన్నార’ని ఇదే చంద్రబాబు చెప్పారు. నిజంగా 85 శాతం ప్రజలు తన పాలన పట్ల సంతృప్తిగా ఉంటే ఇపుడు ఇలా ఓట్ల కోసం అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. పైగా ‘నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ, నేను ఇచ్చిన నీళ్ళు తాగుతూ, నేనిచ్చిన పింఛన్ తీసుకుంటూ’ నన్ను పట్టించుకోవటం మానేసారు. నిజంగా ఎంతటి దీనస్ధితి చంద్రబాబుది.
చంద్రబాబు చెప్పిందంతా నిజమే అనుకున్నా, చంద్రబాబు దగ్గర అన్నీ తీసుకుంటూ కూడా చంద్రన్నను పట్టించుకోవటం మానేసారంటే అర్ధం ఏమిటి? పైగా, పోయిన ఎన్నికల్లో తనకు ఆరు సీట్లే ఇచ్చినా, తాను మాత్రం జిల్లాను అభివృద్ధి చేస్తున్నారట. పింఛన్లు ఇచ్చినా, రోడ్లు వేసినా, నీళ్ళు ఇచ్చినా చంద్రబాబేమన్నా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారా? ప్రజల కనీవసరాలు తీర్చటమన్నది ప్రభుత్వ కనీస ధర్మం. అది కూడా సరిగా జరగటం లేదనే కదా జనాల ఆక్రోశం. ప్రభుత్వం ఇస్తున్న లబ్ది మొత్తం గ్రామస్ధాయిలోని జన్మభూమి కమిటీల ద్వారా కేవలం ‘పచ్చ మనుషులకు’ మాత్రమే అందుతోందని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతున్నది చంద్రబాబుకు వినపడలేదా?
ప్రభుత్వ పథకాలు బాగా అమలు చేస్తున్నా, జనాల అవసరాలు తీరుస్తున్నాకూడా చంద్రబాబును జనాలెవరూ పట్టించుకోవటం లేదంటే వచ్చే ఎన్నికల్లో టిడిపికి గడ్డు పరిస్ధితేనా? ఈ విషయాన్ని చంద్రన్న బాగా ఆలోచించాల్సిందే. అయినా ‘నేను జనాల కోసం అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను’ అని చెప్పుకోవాల్సింది చంద్రబాబు కాదు. ప్రభుత్వం మనకు అది ఇచ్చింది, ఇది ఇచ్చింది అని అనుకోవాల్సింది జనాలు. అప్పుడు చంద్రన్న ఓట్లను అడుక్కోవాల్సిన అవసరం ఉండదు.