చంద్రబాబుకు సవాలు విసిరిన జగన్

First Published May 21, 2017, 8:28 AM IST
Highlights

టిడిపి తరపున పోటీ చేసే వారికి నాగిరెడ్డి సింపతి కలిసి వస్తుందా లేక వ్యతిరేకత ప్రభావం చూపుతుందో అర్ధం కావటం లేదు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కాక అభ్యర్ధి విషయంలో సర్వే చేయించుకుంటున్నారు.   

చంద్రబాబునాయుడుకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సవాలు విసిరారు. నంద్యాల ఉపఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధిని ఖరారు చేసారు. గంగుల ప్రతాపరెడ్డిని పోటీ చేయించాలని జగన్ నిర్ణయించటం ద్వారా సవాలు విసిరినట్లే. గురువారం ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయమైంది. అయితే, ఇంకా బహిరంగ ప్రకటించలేదు అంతే.  తర్వాత తన మద్దతుదారులతో ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తను పోటీ చేసే విషయాన్ని స్పష్టం చేసారు. సో, ప్రతిపక్షం తరపున పోటీ చేసే అభ్యర్ధి ఎవరో తేలిపోయింది కాబట్టి ఇక ప్రకటించాల్సింది చంద్రబాబే.

అయితే, టిడిపి తరపున పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించటం అంత వీజీ కాదు. అభ్యర్ధిని ఎంపిక చేయాలంటే చంద్రబాబుకు అనేక సమస్యలున్నాయి. తండ్రి భూమా నాగిరెడ్డి ఖాళీ చేసిన స్ధానం కాబట్టి తన చెల్లెలినే పోటీ చేయించాలన్నది భూమా నాగిరెడ్డి పెద్ద కూతురు, మంత్రి భూమా అఖిలప్రియ పట్టుదల. అయితే, అఖిల చెల్లెలికి ఎట్టి పరిస్ధితుల్లోనూ టిక్కెట్టు ఇచ్చేందుకు వీల్లేదంటూ శిల్పామోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. నంద్యాలలో పోటీ చేసే అవకాశం తనకే ఇవ్వాలంటూ శిల్పా పట్టుపడుతున్నారు.

అయితే, ఇక్కడ పోటీ చేయటానికి ఈ ఇద్దరే కాకుండా భూమా వీరశేఖరరెడ్డి కొడుకు భూమాబ్రహ్మారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పైగా పోటీ చేసేది తానేనంటూ నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. అసలు భూమానాగిరెడ్డికి ముందు నంద్యాలలో నాగిరెడ్డి అన్న భూమావీరశేఖరరెడ్డే ఎంఎల్ఏ. ఆయన మరణంతో ఖాళీ అయిన స్ధానంలో భార్య పోటీ చేయాలంటే ఆడవాళ్ళకు రాజకీయాలెందుకంటూ అప్పట్లో భూమా నాగిరెడ్డి పట్టుబట్టి టిక్కెట్టు సాధించుకున్నారు.

కాబట్టి ఇపుడు భూమామనస్వినికి రాజకీయాలెందుకు తానే పోటీ చేస్తానంటూ బ్రహ్మారెడ్డి పట్టుబడుతున్నారు. చూసారా, నంద్యాలలో పోటీకి ఎంతమంది పోటీ పడుతున్నారో? ఇక్కడే చంద్రబాబుకు సమస్య మొదలైంది. ఏ ఒక్కరికి టిక్కెట్టు ఇచ్చినా మిగిలిన వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలీదు. అసలే భూమా, శిల్పా, బ్రహ్మారెడ్డి కుటుంబాలకు ఏమాత్రం పడదు. ఏ ఒక్కరికి టిక్కెట్టు ఇచ్చినా మిగిలిన రెండు కుటుంబాలు సహకరించేది అనుమానమే.

దానికితోడు నియోజకవర్గంలో భూమానాగిరెడ్డిపై వ్యతిరేకత మొదలైంది.   అటువంటి సమయంలోనే హటాత్తుగా మరణిచారు. కాబట్టి ఈ పరిస్ధితిల్లో టిడిపి తరపున పోటీ చేసే వారికి నాగిరెడ్డి సింపతి కలిసి వస్తుందా లేక వ్యతిరేకత ప్రభావం చూపుతుందో అర్ధం కావటం లేదు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కాక అభ్యర్ధి విషయంలో సర్వే చేయించుకుంటున్నారు.   

 

click me!