
చంద్రబాబునాయుడు పాలనలో చివరకు మంత్రులు కూడా నిరసన దీక్షలకు దిగక తప్పటం లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అదే మాటను చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల అమలు కోసం నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఓ ర్యాలీ సందర్భంగా మంత్రి పై ప్రకటన చేసారు. చట్టాలు అమలైతేనే మహిళలకు రక్షణ ఉంటుందని కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే సునీత ఓ విషయం మరచిపోయినట్లు కనబడుతోంది. చట్టాలు అమలు చేయల్సింది ఎవరు? ఎవరు అధికారంలో ఉంటే వారే కదా?
మరి, గడచిన రెండున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది టిడిపి ప్రభుత్వమే కదా? కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టిడిపి భాగస్వమే కదా? రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ చట్టాన్ని అమలు చేయమని సునీత ఎప్పుడైనా అడిగారా? పోనీ మంత్రివర్గంలోనైనా చంద్రబాబు వద్ద ఈ ప్రస్తావన తెచ్చారా? కేంద్రం సంగతి వదిలిపెట్టినా రాష్ట్రంలో సిఎంతో చెప్పి చట్టం అమలు చేయించవచ్చు కదా? సునీత ఎన్నడైనా ప్రయత్నం చేసారా లేక ప్రయత్నాన్ని ఎవరైనా అడ్డుకున్నారా?
అధికారంలో ఉన్నవారు సమస్యలను పరిష్కరించాలి. ప్రతిపక్షంలో ఉన్న వారు, ప్రజలు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు, దీక్షలు, నిరాహార దీక్షలు చేయాలి. అయితే, ప్రతిపక్షాలు చేయాల్సిన పనిని మంత్రిగా అధికారంలో ఉండి సునీతే ఆ పని చేస్తానంటే ఎలా? కాబట్టి ఎటుతిరిగీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి సునీత కాస్త శ్రమ తీసుకునైనా సరే చంద్రబాబును ఒప్పించి చట్టాన్ని అమలు చేయిస్తే సరిపోతుంది.
సాధారణ మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేష్ గురించి మాట్లాడటంలో తప్పులేదు. అయితే, ఇప్పటికే చట్టసభల్లో ఉన్న మహిళల పట్ల టిడిపి నేతల ప్రవర్తన విషయంపైన కూడా చంద్రబాబుతో మాట్లాడచ్చు కదా? అసెంబ్లీ సాక్షిగా వైసీపీకి ఎంఎల్ఏ రోజాను తమ పార్టీ ఎంఎల్ఏలు బాగా రెచ్చి గొట్టి ఏడాది పాటు సస్పెండ్ చేయించారు. అదేవిధంగా పార్టీలోనే చిలకలూరిపేట, బాపట్లకు చెందిన ఇద్దరు మహిళా నేతల మరణానికి కారణమైన వారిపై ఇంత వరకూ చర్యలు లేవు. ఇక గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జానీమూన్ పై మంత్రి రావెల కిషోర్ బాబు దాష్టికాలు అందరికీ తెలిసినా మహిళా మంత్రులెవరూ జానీమూన్ కు మద్దతుగా నిలవలేదు. ముందు ఈ విషయాలపై చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుంది.