
చంద్రబాబునాయుడు భ్రమల్లో బ్రతుకుతున్నారా అన్న అనుమానం అందరిలోనూ పెరిగిపోతోంది. 2019లో అమరావతిలో జాతీయ క్రీడల నిర్వహణే తన లక్ష్యంగా చంద్రబాబు తాజాగా వెల్లడించటమే కారణం. ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదికూడా అమరావతిలో. అసలు ఇంతవరకూ నూతన రాజధాని అమరావతి అన్నది కేవలం ఓ ఊహాజనితం మాత్రమే. పేరు పెట్టి ఏడాదిన్నరైనా ఇంత వరకూ నిర్మాణ పరంగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. చంద్రబాబు వ్యవహారం ‘ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడు పేరు సోమలింగం’ అన్నట్లు తయారైంది.
అమరవాతి పేరుతో ఇప్పటికే అనేక ఈవెంట్లను నర్వహించిన చంద్రబాబు నిర్మాణం విషయంలో మాత్రం ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోవాలంటూ అనేక దేశాలను ఆహ్వానిస్తున్న చంద్రబాబు ఇప్పటి వరకూ డిజైన్లను మాత్రం ఖరారు చేయలేకపోవటం విచిత్రం. రాజధాని నిర్మాణమన్నది తన ఇంటి వ్యవహారమనో లేక పార్టీకి మాత్రమే పరిమితమైందనో చంద్రబాబు అనుకుంటున్నురన్న ఆరోపణలు మాత్రం పెరిగిపోతున్నాయి.
దాంతో రాజధాని నిర్మాణంపై న్యాయస్ధానాల్లో కేసులున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు నడుస్తోంది. కొండవీటి వాగు పరీవాహక ప్రాంతంలో నిర్మాణలు చేయకూడదనే విషయంలో అనేక ఆరోపణలున్నాయి. 29 రాజధాని గ్రామాల్లోని ఐదు గ్రామాల్లో ఇంతవరకూ పలువురు రైతులు భూములను ఇవ్వలేదు. ఆ విషయం కోర్టులో ఉంది. అసలు రాజధాని నిర్మాణానికే బాలారిష్టాలు తొలగకపోతే ఇక, జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఎక్కడిది?
జాతీయ క్రీడల నిర్వహణ అంటే మాటలా? వేల కోట్ల రూపాయలవసరం. ఉద్యోగుల జీతాలకే అవస్తలు పడుతున్న ప్రభుత్వం ఏంపెట్టి క్రీడలను నిర్వహిస్తోందో చంద్రబాబే చెప్పాలి. పైగా 2018నాటికి స్టేడియం, ఎరీనాలను నిర్మించాలని ఆదేశాలిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నవేవీ ఆచరణ సాధ్యం కాదన్న విషయం అధికారలకు తెలిసీ చెప్పటం లేదేమో. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారమే కీలకమైన పరిపాలనా నగరం నిర్మాణ డిజైన్లే వచ్చే ఏప్రిల్లో అందుతుంది. వాటని పరిశీలించి మార్పులు చేర్పులు చేయాలి. ఆ తర్వాత తుది డిజైన్లు ఖరారవుతాయి. అప్పుడు అంతర్జాతీయ బిడ్డింగులను ప్రక్రియ మొదలుపెట్టి పూర్తి చేయాలంటే కనీసం మరో రెండు నెలలు అవసరం. అంటే పేపర్ వర్క్ పూర్తవ్వటానికే ఈ ఏడాది చివరకు వచ్చేస్తుంది. అదీ ఎటువంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకపోతే.
రాజధాని నిర్మాణంలోనే ఇన్ని సమస్యలుండగా జాతీయ క్రీడల నిర్వహణ ఎలా సాధ్యం? పైగా ఇప్పటికిప్పుడు జాతీయ క్రీడలను నిర్వహిస్తామంటే కుదరదు. ముందుగానే బిడ్డింగ్ లో పాల్గొనాలి. మౌళిక సదుపాయాలున్నాయన్న విషయాన్ని రుజువు చేసుకోవాలి. రవాణా, బస, వసతి సౌకర్యాలు సరిపడా ఉన్నట్లుగా నిరూపించుకోవాలి. ఇవన్నీ లేకుండానే క్రీడలను నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు చెబుతుంటే విన్నవారందరూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.