
శాసనసభ్యునిగా చంద్రబాబునాయడు విఫలమయ్యారా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ కూడా నియోజకవర్గ అభివృద్ధిలో విఫలమవుతారని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి గడచిన రెండున్నరేళ్ళలో వందల కోట్లు కుమ్మరించారు.
అయినా ప్రభుత్వం ఆశించిన స్ధాయిలో అభివృద్ధి జరగలేదు. అదే విధంగా మంత్రుల్లో ఒక్క ప్రత్తిపాటి తప్ప మిగిలిన వారందరూ తమ నియోజకవర్గాల అభివృద్ధిని గాలికి వదిలేసినట్లు కనబడుతోంది.
కలెక్టర్ల సమీక్ష సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన 12 ఉత్తమ నియోజకవర్గాల జాబితాలో కుప్పం లేకపోవటం ఆశ్చర్యమే. అంతేకాదు, మంత్రివర్గంలోని ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్య వహిస్తున్న చిలకలూరి పేట తప్ప మరో మంత్రి నియోజకవర్గం లేకపోవటం గమనార్హం.
అంటే గడచిన రెండున్నర ఏళ్ళలో ఏ మంత్రి కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సక్రమంగా పనిచేయలేదనే అర్ధం. అంతేకాకుండా ఎంపికైన 12 ఉత్తమ నియోజకవర్గాల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకూ రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన నియోజక వర్గాలు కావు.
గ్రాస్ వాల్యూ ఆడిట్లోని 14 అంశాల ఆధారంగా ప్రభుత్వం 12 నియోజకవర్గాలను ఎంపిక చేసింది. 14 అంశాల్లో తలసరి ఆదాయం, నీరు-ప్రగతి, మీకోసం ఫిర్యాదుల పరిష్కారం, ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ల పంపిణీ, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై ర్యాంకింగ్ లు ఇచ్చింది ప్రభుత్వం.
వెలువడిన జాబితా ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్న గోపాలపురం, భీమవరం, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాలు మొదటి నాలుగు స్ధానాలు దక్కించుకున్నాయి. అలాగే, 5వ స్ధానంలో మండపేట, 6వ స్ధానంలో గన్నవరం, 7వ స్ధానంలో చిలకలూరిపేట, 8వ స్ధానంలో నిడదవోలు, తొమ్మిదో స్ధానంలో తణుకు, 10వ స్ధానంలో రాజమండ్రి, 11వ స్ధానంలో శింగనమల, 12వ స్ధానంలో విశాఖపట్నం(వెస్ట్) నియోజకవర్గం నిలవటం గొప్పే.