
రాష్ట్ర విభజన దెబ్బతో చంద్రబాబునాయుడుకు ఏమో అయినట్లుంది. ఏ విషయమైన సరే ఒకరోజు చెప్పిన దానికి విరుద్ధంగా మరుసటి రోజు మాట్లాడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు అంశమే తాజా ఉదాహరణ. అయితే, ముందు రాష్ట్ర విభజన విషయాన్నే తీసుకుందాం. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మూడు లేఖలను టిడిపి ఇచ్చింది. ఆ తర్వాత చాలా కాలానికి రాష్ట్ర విభజన జరిగింది.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపిలో ప్రచారం చేస్తూ రాష్ట్ర విభజన మనం కోరుకున్నది కాదన్నారు. తెలంగాణాలో మాట్లాడుతూ, టిడిపి ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఏ సందర్భం వచ్చినా రెండు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు పరస్పర విరుద్ధగానే మాట్లాడుతున్నారు.
తాజాగా పెద్ద నోట్ల రద్దు విషయంలో ఇప్పటికి ఎన్నిమార్లు మాట మార్చారో లెక్కేలేదు. అంటే ఏ విషయంలోనైనా లాభం జరుగుతుందనుకుంటే తానే చేసినట్లు చెప్పుకుంటున్నారు. అదే నష్టం జరుగుతుందనుకంటే తనకు సంబంధమే లేదంటారు. ఇటువంటి ధ్వంధ్వ వైఖరి వల్లే టిడిపి శ్రేణులు అయోమయంలో పడుతున్నాయి.
నవంబర్ 8వ తేదీన ప్రధానమంత్రి పెద్ద నోట్లను రద్దు చేయగానే మీడియా సమావేశం పెట్టారు. తాను లేఖ రాసినందు వల్లే పెద్ద నోట్లను మోడి రద్దు చేసినట్లు చెప్పారు. అయితే, తర్వాత మొదలైన ప్రజాగ్రహాన్ని చూసిన తర్వాత నోట్ల రద్దుకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. నల్లధనాన్ని నియంత్రించాలని మాత్రమే తాను చెప్పానని తెలిపారు.
సోమవారం జరిగిన పార్టీ ఎంపిలు, ఎంఎల్ఏ, ఎంఎల్సీల సమావేశంలో మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు తాము కోరుకున్నది కాదన్నారు. కేంద్రం చర్య వల్లే ప్రజలందరూ ఇబ్బందుల పడుతున్నట్లు వాపోయారు.
తాజాగా మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో పెద్ద నోట్ల రద్దుపై మాట్లాడుతూ తాను రాసిన లేఖ వల్లే పెద్ద నోట్లను ప్రధాని రద్దు చేసినట్లు చెప్పారు. దాంతో అక్కడే ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు రోజుకో మాట ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కాక అందరూ జుట్టు పీక్కుంటున్నారు.