
‘పనిచేసేవారికి తగిన గుర్తింపు ఇవ్వటంతో పాటు పనిదొంగలకు ఎంతోకొంత శిక్ష ఉండాలి’...ఇది చంద్రబాబునాయుడు తాజా వ్యాఖ్యలు. వినటానికి విచిత్రంగా లేదూ. ప్రజలనుండి వచ్చే ఫిర్యుదులు, విజ్ఞప్తులకు సకాలంలో పరిశీలించి, పరిష్కరించిన అధికారులకు నగదు బహుమతి ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అదే సందర్భంలో ‘సరైన కారణం లేకుండా ప్రజలను తిప్పుకుంటూ, వారి సమస్యను పరిష్కరించకుండా పెండింగ్ లో ఉంచే అధికారులకు జరిమానా వేద్దాం’ అని కూడా చంద్రబాబు అన్నారు.
పనిచేసే అధికారులకు ప్రోత్సాహకంగా నగదు బహుమానాలిచ్చి, పనిచేయని వారిని శిక్షించకపోతే వ్యవస్ధలో మార్పు రాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పైగా కొందరిలో ఎంత చెప్పినా మార్పు రావటం లేదని కూడా చంద్రబాబే అంటున్నారు. పనిచేసేవారికి ప్రోత్సాహకాలేమిటో? పనిచేయని వారికి కొత్తగా శిక్షించటాలేమిటో అర్ధం కావటం లేదు. ప్రభుత్వ అధికారులు ఉన్నదెందుకు? యంత్రాంగం చేయాల్సిన పనులేమిటి?
ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదే ప్రజలకు సేవలు చేయటానికి. అది వారి బాధ్యత. అందుకేకదా వారికి జీత, బత్యాలు ఇస్తున్నది? టైంకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ప్రోత్సాహకాలు కాదా? కొత్తగా నగదు బహుమతులేమిటి మధ్యలో? పనిచేయటమన్నది అధికారులు, సిబ్బంది బాధ్యత.
ఇక, పనిచేయని వారికి శిక్షలట. కొందరు ఎంత చెప్పినా మారటం లేదట. విచిత్రంగా లేదూ చంద్రబాబు మాటలు. పనిచేయని అధికారులు, సిబ్బందికి ఎటువంటి శిక్షలు విధించాలో ఉద్యోగుల మాన్యువల్లోనే ఉంటుంది. తప్పుచేసిన సిబ్బందిని శిక్షించలేకపోవటం ప్రభుత్వం అసమర్ధత. ఇపుడు కొత్తగా చంద్రబాబు ప్రవేశపెడుతున్నదేమీలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాదికారుల నుండి దాదాపు అన్నీ విభాగాల్లోని అధికారులపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఇంతకాలం చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు?
అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇటు నేతలకు, అటు పలువురు అధికారులకు అడ్డదిడ్డంగా సంపాదించుకునేందుకు లైసెన్సులు ఇచ్చేసారు. వారంతా సంపాదన కోసం ప్రజలమీద పడుతుంటే అన్నీ వర్గాల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇపుడు ప్రోత్సాహకాలు, శిక్షలంటూ కొత్త పాట అందుకుంటున్నారు చంద్రబాబు.