ఇఫ్తార్ ముసుగులో రాజకీయం...

First Published Jun 22, 2017, 9:04 AM IST
Highlights

నియోజకవర్గంలో ముస్లింఓటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది. అందుకనే ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు. విందు సందర్భంగా ముస్లింల్లోని ప్రముఖులదరినీ రప్పించారు. టిడిపికి మద్దతు ఇవ్వాలంటూ కోరారు. పలువురి నుండి హామీలు కూడా తీసుకున్నట్లు సమాచారం.

పేరుకు మాత్రమే ఇఫ్తార్ విందు. జరిగిందంతా రాజకీయమే. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా నంద్యాలలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ విందులో రానున్న ఉపఎన్నిల్లో పోటీ చేయబోయే భూమా బ్రహ్మానందరెడ్డిని పరిచయం చేసారు. బ్రహ్మానందరెడ్డి గెలుపుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

నియోజకవర్గంలో ముస్లింఓటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది. అందుకనే ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు. విందు సందర్భంగా ముస్లింల్లోని ప్రముఖులదరినీ రప్పించారు. టిడిపికి మద్దతు ఇవ్వాలంటూ కోరారు. పలువురి నుండి హామీలు కూడా తీసుకున్నట్లు సమాచారం. సరే, ఎవరైనా వచ్చి మద్దతు ఇవ్వాలంటే కుదరదిన ఎవరు కూడా మొహం మీద చెప్పరుకదా? ఓట్లడిగిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా వేస్తామనే చెబుతారు. తర్వాత ఎవరిష్టం వారిది.

అంతుకుముందు నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సులోచనను పదవిలో నుండి దింపేందుకు స్ధానిక నేతలతో మంతనాలు జరిపారట. మున్సిపాలిటీలో మొత్తం 42 మంది కార్పొరేటర్లున్నారు. పోయిన ఎన్నికల్లో వైసీపీకి 13 మంది, టిడిపి తరపున 29 మంది గెలిచారు. అయితే, శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరినపుడు మున్సిపాలిటీలోని కార్పొరేటర్లు కూడా వెళ్ళిపోయారు. అలా వెళ్లిన వారిలో ఛైర్ పర్సన్ సులోచనతో పాటు 25 మంది కార్పొరేటర్లు కూడా వైసీపీలో చేరారు. అంటే వైసీపీ బలం ఒక్కసారిగా 38కి చేరుకోగా, టిడిపి బలం 4.

 నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికలో మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లే కీలకం. అటువంటిది మున్సిపాలిటీ ప్రస్తుతం వైసీపీ చేతిలోకి వెళ్ళిపోయింది. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. ఇదే పరిస్ధితి ఉప ఎన్నిక జరగే వరకూ కొనసాగితే టిడిపికి ఇబ్బందే. అందుకనే మున్సిపాలిటీని వైసీపీ నుండి ఎలాగైనా టిడిపి చేతిలోకి తీసుకోవాలని వ్యూహాలు మొదలయ్యాయి. ఏం జరుగుతుందో చూడాలి.

click me!