(వీడియో) కాపుల్లో స్పష్టమైన చీలికొచ్చింది...

First Published Aug 14, 2017, 12:36 PM IST
Highlights
  • మొత్తానికి చంద్రబాబునాయుడు అనుకున్నది సాధించారు. కాపుల్లో స్పష్టమైన చీలిక తెచ్చారు.
  • ముద్రగడ ప్రభావం ఎన్నికల్లో ఎక్కడ పడుతుందో అన్న ఆందోళనతో హడావుడిగా విజయవాడలో ఈరోజు కాపు నేతలతో ఓ మీటింగ్ ఏర్పాటు చేసారు.
  • అందులో మాట్లాడిన వక్తల్లో పలువురు కాపులకు చంద్రబాబు చాలా చేస్తున్నారంటూ భజన అందుకున్నారు.
  •  

మొత్తానికి చంద్రబాబునాయుడు అనుకున్నది సాధించారు. కాపుల్లో స్పష్టమైన చీలిక తెచ్చారు. కాపులను బిసిల్లోకి చేరుస్తానని పోయిన ఎన్నికల్లో హామీ ఇచ్చింది చంద్రబాబే. అయితే తానిచ్చిన హామీ ఆచరణ సాధ్యం కాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా హామీ ఇచ్చేసారు, దాన్ని కాపులు కూడా నమ్మారు. అధికారం అందుకోగానే ఇపుడు విషయాన్ని నానుస్తున్నారు. అందుకనే ముద్రగడ పద్మనాభం ఏడాదిన్నరగా ఆందోళన బాటపట్టారు.  ముద్రగడకు మద్దతుగా రాష్ట్రంలోని కాపు సామాజికవర్గంలోని పలువురు ఆందోళనకు మద్దతు పలికారు.

అప్పటి నుండి ప్రభుత్వానికి కాపు సెగ బాగానే తగులుతోంది. దాంతో ముద్రగడను ఎదుర్కొనేందుకు చంద్రబాబు టిడిపిలోనే ఉన్న కాపులను రంగంలోకి దింపారు. అధికారంలో ఉన్నారు కాబట్టి మంత్రులు, ఎంఎల్ఏలు చంద్రబాబు చెప్పినట్లే వింటున్నారు. దాంతో సామాజికవర్గంలో మెజారిటీ కాపులు అధికారపార్టీ నేతలపై మండిపడుతున్నారు. రిజర్వేషన్లు కల్పించలేని తన అశక్తతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబే కొందరు కాపు నేతలతో తమకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పిస్తున్నట్లు కనబడుతోంది.

ఇటువంటి సమయంలోనే నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలొచ్చిపడ్డాయి. దాంతో చంద్రబాబుకు మరింత ఇబ్బంది మొదలైంది. దానికితోడు నంద్యాల, కాకినాడలోని కాపులందరూ టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ జెఏసి తరపున ముద్రగడ పిలుపునిచ్చారు. ముద్రగడ ప్రభావం ఎన్నికల్లో ఎక్కడ పడుతుందో అన్న ఆందోళనతో హడావుడిగా విజయవాడలో ఈరోజు కాపు నేతలతో ఓ మీటింగ్ ఏర్పాటు చేసారు.

అందులో మాట్లాడిన వక్తల్లో పలువురు కాపులకు చంద్రబాబు చాలా చేస్తున్నారంటూ భజన అందుకున్నారు. పైగా కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ చాలని రాజకీయ రిజర్వేషన్ అవసరం లేదంటూ పెద్ద బ్యానర్ ను ప్రముఖంగా పెట్టటం గమనార్హం. ఈరోజు సమావేశంతో కాపుల్లో స్పష్టమైన చీలక వచ్చినట్లైంది. చీలకలు గతంలో కూడా ఉన్నా కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదన్న మాటను బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. ఈ రోజు ఆ ముచ్చట కూడా జరిగిపోయింది.

click me!