
‘రాష్ట్రంలో నేనే మొదటి కార్మికుడిని’. ‘ఏదైనా సన్మానం చేయాలనుకుంటే ముందుగా నాకే చేయాలి’ ఇది మేడే సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలు. దాంతో చంద్రబాబు వ్యవహారం ఏమిటో ఒకపట్టాన అర్ధం కావటంలేదు. ఒకసారేమో తనను తాను సిఈఓగా అబివర్ణించుకుంటారు. ఇంకోవైపేమో తానే మొదటి కార్మికుడినంటారు. మరోవైపు తాను చంఢశాసనుణ్ణి అంటారు.
ఒక్కమనిషిలో ఇన్ని పార్శ్వాలేమిటో అర్ధం కావటం లేదు. పడుకునే సమయంలో తప్ప పగలు, రాత్రి తేడా లేకుండా, అలుపులేకుండా పనిచేస్తున్నానని చంద్రన్న అన్నారు. కాబట్టే మొదటి సన్మానం తనకే చేయాలట. అదిరింది కదా చంద్రబాబు లాజిక్.
అదే సమయంలో బయటవాళ్ళు వచ్చి యూనియన్లు పెట్టి గొడవలు పెట్టి కార్మికులు రోడ్డున పడిన తర్వాత పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఆ వాదనలో కొంత వరకూ నిజముండవచ్చు. కాబట్టి యూనియన్లను నమ్మవద్దన్నట్లుగా చెప్పారు. మరి టిడిపికి అనుబంధంగా పనిచేస్తున్న తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టిఎన్టీయుసి) కూడా అదే పని చేస్తోందా? చంద్రబాబు మాటలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
సరే, అసలు విషయానికివస్తే, చంద్రబాబుకు ఎందుకు మొదటి సన్మనం చేయాలి? ఎందుకంటే, రాజధాని నిర్మాణాన్ని అనుకున్న సమయంకన్నా ముందే పూర్తి చేసినందుకు. రుణమాఫీని పూర్తిగా అమలు చేసినందుకు. జాబు కావాలంటే బాబు రావాలన్న ఎన్నికల నినాదంలో భాగంగా లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు.
దేశదేశాలు తిరిగి లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తున్నందుకు, ఉద్యోగాలు ఇవ్వలేని వారికి నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తున్నందుకు. ఎటువంటి సౌకర్యాలు లేకుండానే వేలాది ఉద్యోగులకు హైదరాబాద్ నుండి వెలగపూడి తరలించినందుకు, పోలవరం నిర్మించేసి, ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ సాధించినందుకు. చివరగా ఓటుకునోటు కేసు దెబ్బకు రాష్ట్రప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టినందుకు కూడా, చేయాలి చంద్రబాబుకు మొదటి సన్మానం.