
చంద్రబాబునాయుడు ఆలోచనలు ఓ పట్టాన అర్ధంకావు. నంద్యాల ఉపఎన్నికలో టిడిపి గెలిచినందుకు విజయోత్సవసభ నిర్వహిస్తున్నారు శుక్రవారం నాడు. పనిలో పనిగా అభ్యర్ధి విజయవానికి పనిచేసిన మంత్రులు, ఎంఎల్ఏలందరూ వెళ్ళి జనాలను కలవాలట. తామిచ్చిన హామీల అమలుపై జనాలకు మరింత స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. నిజానికి మంత్రులు గానీ ఎంఎల్ఏలు గానీ ప్రత్యేకంగా నంద్యాలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి?
ఉపఎన్నిక అనివార్యమని తేలిపోవటంతో గడచిన మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న పనులను ప్రభుత్వమే హడావుడిగా మొదలుపెట్టింది. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి మొదలుపెట్టిన పనులను అరాకొరాగా వదిలేసింది. వాటిని చూపించే ఓటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి ఓట్లు పిండుకున్నది వాస్తవం. అంతేకానీ మంత్రులు, ఎంఎల్ఏలు కొత్తగా ఓటర్లకు ఇచ్చిన హామీలేవీ లేవు. చేపట్టిన, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కుడా చంద్రబాబు తన మూడు విడతల పర్యటనల్లో అనేకమార్లు చెప్పేసారు.
మళ్ళీ ఇపుడు మంత్రులు, ఎంఎల్ఏలు కొత్తగా జనాలను కలిసి మాట్లాడేదేముంటుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అందుకనే వాళ్ళని వెళ్ళమని చంద్రబాబు చెప్పినపుడు ఎవరూ ఇష్టపడలేదు. కానీ చంద్రబాబు గట్టిగా చెప్పటంతో తప్పనిసరిగా బయలుదేరుతున్నారు. సరే ఇంతమంది ఎటూ వస్తున్నారు కాబట్టి విజయోత్సవసభ కుడా పెట్టుకుంటామని భూమా బ్రహ్మానందరెడ్డి అడిగితే చంద్రబాబు సరే అన్నారు.
నిజానికి విజయోత్సవ సభకు హాజరవ్వాల్సింది చంద్రబాబే. ఎందుకంటే, నంద్యాలలో టిడిపి గెలిచిందంటే అందుకు కారణం చంద్రబాబు మంత్రాంగమే తప్ప ఇంకోటి కాదు. అభ్యర్ధి విజయానికి ఇంతమంది క్షేత్రస్ధాయిలో పనిచేసినా అంతా ఉత్సవిగ్రహాలే. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన చంద్రబాబేమో అమరావతిలోనే కూర్చుంటారట. హామీలతో సంబంధమే లేని వాళ్ళంతా నంద్యాలకు వెళ్ళి హామీలపై స్పష్టత తీసుకురావాలట. అంటే దీని వెనుక కూడా చంద్రబాబు ఏదో ప్లాన్ చేసే ఉంటారని అందరూ అనుమానిస్తున్నారు. అందేంటో కొంత కాలం అయిన తర్వాత కానీ బయటకురాదు.