
చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు సంపాదించిన హెరిటేజ్, ఇతర ఆస్తులను పేదలకు పంచితే తాము కుడా అలానే చేయటానికి సిద్దమంటూ వైసీపీ సవాలు విసిరింది. పార్టీ అధికారప్రతినిధి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చేనాటికి ఆయన ఆస్తి కేవలం 2 ఎకరాలు మాత్రమేనన్నారు. ఆ తర్వాత సంపాదించిందంతా ఎలా సంపాదించారో లెక్కలు చెప్పాలని నిలదీసారు. రాజకీయాల్లోకి వచ్చిన వారంతా తమ ఆస్తులను పేదలకు పంచేలా చేయగలరా అంటూ చంద్రబాబును చాలెంజ్ విసిరారు. అమరావతిని ప్రపంచంలోనే మేటి రాజధానిగా నిర్మిస్తామంటూ చంద్రబాబు 39 నెలలుగా పబ్బం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. రాజధాని డిజైన్లకు సినీ దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు చెప్పటం విడ్డూరమని ఎద్దేవా చేసారు. విశాఖ భూ కుంభకోణం గురించి మాట్లాడుతూ, ప్రభుత్వం నియమించిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)వల్ల ఎటువంటి ఉపయోముండదని తాము ముందు నుండి చెబుతూనే ఉన్నామన్నారు. చిన్నవారిపై కేసులు పెట్టి పెద్దలను సిట్ కాపాడుతోందంటూ మండిపడ్డారు. టిడిపి హయాంలో విశాఖపట్నంకు ఎటువంటి ఉపయోగం జరగదని తేలిపోయిందన్నారు.